బైక్‌తోపాటు బావిలో పడిన రవి
కేసముద్రం(మహబూబాబాద్): అదుపుతప్పి రోడ్డుపక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్ర వాహనంతో పడిన ఓ వ్యక్తిని హెల్మెట్ బతికించింది. తీవ్ర గాయాలతో బావిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కల్వల గ్రామ శివారు గాంధీపురం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం..ఖమ్మం జిల్లా తిరుమరాయపాలెం మండలం తిప్పరెడ్డిడూడెం గ్రామానికి చెందిన బర్మావత్ రవి అనే యువకుడు కేసముద్రం నుంచి మహబూబాబాద్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు.
ఈ క్రమంలో కల్వల గ్రామశివారు గాంధీపురం దగ్గరలో మలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో వ్యవసాయబావిలోకి బైక్‌తో సహా రవి పడియాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సైతోపాటు పోలీసు సిబ్బంది, మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. తాడు సాయంతో మంచంలో క్షతగాత్రుడిని బయటకు తీశారు. కాళ్లు, చేతులకు, నడుముభాగంలో రవికి గాయాలయ్యాయి. కాగా, అతన్ని 108లో మానుకోట ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్ ధరించడం వలన నీళ్లులేని బావిలో బైక్‌తోపాటు పడిన రవి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment