
చిన్నారికి హెల్మెట్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్
సాక్షి, బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదాలు నగరంలో అంతకంతకు పెరుగుతున్నాయి. బయటికి వెళ్లిన వాహనదారులు ఇంటికి క్షేమంగా వచ్చేవరకు ఆందోళనకరంగా గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు దెబ్బలు తగిలి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మందికి పట్టింపు ఉండటం లేదు. అయితే కొంత మంది మాత్రం తమతో పాటు తమ పిల్లలు, వాహనాలు నడిపే సమయంలో భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా శిరస్త్రాణం ధరిస్తున్నారు.
బుధవారం నానక్‌రాంగూడ చౌరస్తాలో ఓ మహిళ తాను హెల్మెట్ ధరించడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్తున్న నాలుగేళ్ల కూతురికి కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి స్కూటీ నడిపిస్తున్న దృశ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ముచ్చటపడ్డ ఈ దృశ్యాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్ వేదికగా షేర్‌చేసుకోగా వేలాది మంది ఆ వీడియోకు ఫిదా అయ్యారు. తల్లి తానే కాకుండా తన కూతురికి కూడా హెల్మెట్ ధరించి స్కూటీ నడిపిస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిందంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరు హె ల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాంటూ సందేశాన్నిచ్చింది.
Inspiring Mother & Daughter duo I ran into at Nanakram guda chourastha today !!!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 23, 2022
Wear Helmet & Be safe 😊🙏🏻 pic.twitter.com/0RfV6Bj2rH