
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు వామపక్ష, లౌకికవాద పార్టీలను గెలిపించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, ప్రగతిశీల శక్తులతో కలసి పోటీచేయాలని అన్నారు. శుక్రవారం మఖ్దూం భవన్‌లో భాగం హేమంతరావు అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సురవరం మాట్లాడుతూ.. సోషల్ మీడియానూ బీజేపీ తన ప్రచారానికి వాడుకుంటోందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర శక్తులపై ఉందన్నారు. దేశంలోని మీడియా 75 శాతం కార్పొరేట్ రంగం చేతుల్లో ఉందని, దీన్ని అదునుగా తీసుకుని బీజేపీ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.
నిరంకుశ ధోరణులు ప్రబలుతున్నాయి: చాడ
రాష్ట్ర చరిత్రలో కనీవిని రీతిలో నిరంకుశ ధోరణులు ప్రబలుతున్నాయని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో మెజార్జీ ఉన్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తోన్న తీరు రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేదన్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ కూటమిగా పోటీ చేసిన పార్టీలతో కాంగ్రెస్ కనీసం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కలసి పోటీచేసే 2 స్థానాల్లో ప్రజలు ఆదరించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, సాంబశివరావు, గుండా మల్లేష్, పశ్యపద్మ, శ్రీనివాసరావు, ఎన్.బాలమల్లేష్ పాల్గొన్నారు.