సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. జై తెలంగాణ అన్నవారిని అణచివేసి, తెలంగాణ వద్దన్న వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి బంగారు తెలంగాణ నిర్మిస్తామంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం లక్ష్మణ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ సభ్యత్వ నమోదుపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే ‘దొంగే దొంగా.. దొంగా..’ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. వారి తప్పిదాలను ఎదుటి వారిపై రుద్ది ప్రజలను నమ్మించే నాటకానికి కేటీఆర్ తెర తీశారన్నారు.
తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను, అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యనాయకుల చేరికలను చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కష్టనష్టాలను ఓర్చుకొని తెగించి పోరాడిన ఉద్యమకారులను పూర్తిగా విస్మరించడంతో వారు బయటకు వచ్చి టీఆర్‌ఎస్ విధానాలను తప్పు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో నేతలు బీటీ బ్యాచ్‌గా, ఓటీ బ్యాచ్‌లుగా విడిపోయారన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు బీజేపీ ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ‘బీజేపీ సభ్యత్వం ఇప్పటికే 18 లక్షలు ఉండగా, కొత్తగా 12 లక్షలు కలుపుకొని 30 లక్షలకు చేరుకుంది. ఇంకా 6 లక్షల సభ్యత్వ నమోదు కావాల్సి ఉంది’ అని లక్ష్మణ్ తెలిపారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి చెందిన నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. అవినీతికి పాల్పడిన చిదంబరాన్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు గుండెలు బాదుకుంటున్నారని లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. జైల్లో ఉండాల్సిన కాంగ్రెస్ నేతలు బెయిల్‌పై తిరుగుతున్నారని.. అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని చిదంబరం చిట్టాయే కాదు.. మిగతా వారి చిట్టా కూడా బయటకు వస్తుందని తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్‌ను పాతర పెట్టాలని బీజేపీ శ్రేణులకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment