‘దేశం’తో పొత్తు ముంచింది | BJP leaders angry on TDP alliance | Sakshi
Sakshi News home page

‘దేశం’తో పొత్తు ముంచింది

Published Mon, May 19 2014 1:02 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

BJP leaders angry on TDP alliance

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  ‘దేశం’తో దోస్తీ కట్టిన పాపానికి జిల్లాలో ‘కమలం’ వాడిపోయింది. జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తే ఏ ఒక్క చోట కూడా ఆ పార్టీ అభ్యర్థులను విజయం వరించలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆ శ్రేణులు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదంలోనూ ఆ పార్టీ కృషి ఎంతో ఉంది. ఇలా ఆ పార్టీకి వచ్చిన క్రెడిట్ అంతా.. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబుతో ఎన్నికల్లో జతకట్టడం వల్ల బూడిదలో పోసిన పన్నీరు అన్న చందంగా తయారైంది.

టీడీపీతో పొత్తు కారణంగా ప్రజలు బీజేపీని ఆదరించలేదని, పొత్తు తమను దెబ్బతీసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమయ్య ప్రకటించారు. టీడీపీతో సీట్ల సర్దుబాటులో భాగంగా జిల్లాలో ఆ పార్టీకి నాలుగు ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పాయల్ శంకర్, ముథోల్‌లో రమాదేవి, మంచిర్యాలలో ముల్కల్ల మల్లారెడ్డి, చెన్నూరులో రాంవేణులు పోటీ చేశారు. కానీ వీరిలో ఎవరిని విజయం వరించలేదు. పైగా టీ డీపీతో పొత్తుతో పెట్టుకుంటే ఆ రెండు పార్టీల నాయకులు కలిసి పనిచేయాలి. కానీ ఎన్నికల్లో ఇందుకు విరుద్ధంగా రెండు పార్టీల శ్రేణులు వ్యవహరించాయి. అధినాయకత్వం కూడా ఎవరి వారే అన్న చందంగా వ్యవహించాయి. ఎక్కడ కూడా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన దా ఖలాల్లేవు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థు లు పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్ర చారం చేస్తే.. బీజేపీ అభ్యర్థులు బరిలో దిగిన చోట మా త్రమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి బహిరంగ స భలు జరిగాయి. పైగా రెండు పార్టీల నాయకులు సహకరించుకోవాల్సింది పోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన చెన్నూరులో కాంగ్రె స్ అభ్యర్థి వినోద్ విజయం సాధిస్తారని ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. అంతకు ముందు సీట్ల సర్దుబాట్లలోనూ రెండు పార్టీల మద్య విభేధాలు రచ్చకెక్కాయి. పైగా టీడీపీతో సీట్ల సర్దుబాటు వ్యవహరం బీజేపీలో ముసలం సృష్టించింది. జిల్లాలో ఒక్క గిరిజన సీటు కూడా బీజేపీకి దక్కకుండా చేశారంటూ బీజేపీ జిల్లా నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు దేశమంతటా నరేంద్రమోడీ గాలి వీచింది.

 కానీ టీడీపీతో జత కట్టిన కారణంగా జిల్లాలో నమో ప్రభావం కనిపించకుండా పోయింది. నాలుగు చోట్ల పోటీ చేసిన బీ జేపీ అభ్యర్థులు ఆదిలాబాద్, ముథోల్‌లలో మాత్రమే రెం డో స్థానంలో నిలువగలిగారు. మంచిర్యాలలో బీజేపీ అభ్యర్థికి నామమాత్ర ఓట్లు రాగా, చెన్నూరులో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. టీడీపీతో జతకట్టడం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని, ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లయినా గెలిచేవారమని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దేశమంతా మోడీ హవా ఉంటే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండటానికి  టీడీపీతో పొత్తే కారణమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement