సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీడీపీ-బీజేపీ పొత్తు, సీట్ల పంపకాల్లో తెర వెనుక జరిగిన ‘వ్యవహారాలు’ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేత, ఎంపీ రాథోడ్ రమేష్ వద్ద ముడుపులు తీసుకుని జిల్లాలోని ఎస్టీ ఎమ్మెల్యే స్థానాలను టీడీపీకి అమ్ముకున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్యపై ఆ పార్టీ ముఖ్య నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. తూర్పు జిల్లాకు చెందిన గోనె శ్యాంసుందర్‌రావుతో కలిసి భూమయ్య బీజేపీకి ఒక్క ఎస్టీ సీటు దక్కకుండా చేశారంటూ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చిన భూమయ్యను స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిలదీశారు.
ఈ సందర్భంగా ఏకంగా ఆయనపై దాడికే యత్నించడం.. వెంటనే ఆయన అక్కడి నుంచి చిత్తగించడం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలో ఆదిలాబాద్ ఎంపీ స్థానంతోపాటు, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. రెండు పార్టీల పొత్తుల్లో ఈ నాలుగింటిలో ఒక్క ఎస్టీ సీటు కూడా బీజేపీకి ఇవ్వకపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గిరిజన స్థానాలు టీడీపీకి కట్టబెట్టిన అయ్యనగారి భూమయ్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చే అర్హతే లేదని ఆ పార్టీ ముఖ్య నాయకులు మడావి రాజు పేర్కొంటున్నారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ గిరిజనులను ఓట్లు అడగాలని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటికే భూమయ్యపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ దీని ప్రభావం ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో బీజేపీ శ్రేణులు సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో టీడీపీ నాయకులు దూరంగా ఉంటున్నారు. దీని ప్రభా వం ముఖ్యంగా ఎంపీ అభ్యర్థి రాథోడ్ గెలుపు ఓటములపై పడటం ఖా యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ విషయమై.. అయ్యనగారి భూమయ్యను అడుగగా.. రాథోడ్ రమేష్‌తో నేను ఎలాం టి కుమ్ముక్కు కాలేదు. అవగాహన లేకపోవడంతోనే కొందరు నాయకులకు డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తి అవాస్తవం. సీట్ల పంపకాల్లో నా ప్రమేయం లేదు అని పేర్కొన్నారు.
రాజీనామా యోచనలో పలువురు
పొత్తుల్లో బీజేపీకి నాలుగు స్థానాలు కేటాయించారు. ఈ నాలుగింటిలో టీడీపీకి నుంచి వచ్చిన వారికే బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక చేయడంపై బీజేపీ నాయకులు అసంతృప్తి తో ఉన్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి శంకర్ టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినవారే. అలాగే ముథోల్ బీజేపీ అభ్యర్థి రమాదేవి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇలా టీడీపీ నుంచి వచ్చిన నాయకులకే బీజేపీ టిక్కెట్లు ఇవ్వడంపై ఆ పార్టీలోని సీని యర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన నాయకులు కూడా తమను పట్టించుకోక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు బీజేపీలోని పలువురు జి ల్లా నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీజేపీ ముఖ్యనాయకులు కొందరు పేర్కొంటున్నారు.
వెలుగు చూస్తున్న ‘వ్యవహారాలు’
Published Wed, Apr 16 2014 6:37 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
Advertisement