
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆదివారం ఢిల్లీలో పార్టీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీ వచ్చిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావులు బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, ప్రకాశ్ జవదేకర్, రాం మాధవ్, మురళీధర్‌రావు, షహనవాజ్ హుస్సేన్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, నూనె బాల్‌రాజు ఎంపీల వెంట ఉన్నారు.