విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి | BJP steps up heat on KCR government over Telangana Liberation Day | Sakshi
Sakshi News home page

విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి

Published Wed, Sep 11 2019 3:26 AM | Last Updated on Wed, Sep 11 2019 3:34 AM

BJP steps up heat on KCR government over Telangana Liberation Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్‌ చేసింది. విమోచన దినోత్సవాన్ని నిర్వహించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని జరపకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఎంఐఎం అడుగులకు మడుగులొత్తుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించి భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్‌ పోలో, ఉద్యమ పోరాటాన్ని వివరిస్తూ తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యం లో మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలసి ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ప్రారంభించారు. బైరాం పల్లి కాల్పుల ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల్ని, ఆ ఉదంతం ప్రత్యక్ష సాక్షులను ఈ సందర్భంగా సన్మానించారు.

నాడొక మాట.. నేడొక మాట
అధికారంలోకి కాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పటి సీఎం రోశయ్యను డిమాండ్‌ చేసిన కేసీఆర్‌ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు మిన్నకుండిపోతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏంఐఎంకు తాకట్టుపెడుతోందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ చరిత్రను మాత్రమే చెప్పుకొనేలా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. విమోచన ఉద్యమ పోరాటాన్ని ప్రతిఒక్కరికీ తెలిసేలా కృషి చేస్తామని మనోజ్‌ తివారీ అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు డి.అరవింద్, మోహన్‌రావు, సీనియర్‌ నేతలు శ్రీరాం వెదిరే, సత్యకుమార్, పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, విమోచన కమిటీ చైర్మన్‌ శ్రీవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement