మద్దతు తెలిపిన టీడీపీ
రెండుసార్లు అసెంబ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైల్ అలైన్‌మెంట్ మార్పుపై ఇచ్చిన వాయిదా తీర్మానంమీద చర్చకు గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో భారతీయ జనతాపార్టీ పట్టుబట్టింది. శాసనసభలో తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాకే ప్రశ్నోత్తరాలను తీసుకోవాలన్న బీజేపీ డిమాండ్‌కు స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించకపోవడంతో సభ రెండుమార్లు వాయిదా పడింది. బీజేపీకి టీడీపీ సభ్యులు మద్దతు తెలపడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దీనిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
మెట్రోరైల్ అలైన్‌మెంట్ మార్పుపై జంట నగరాల పరిధిలోని అన్ని పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించాకే ఎలాంటి నిర్ణయమైనా ఉంటుందని చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఉదయం సభ ప్రారంభంకాగానే బీజేపీ సభ్యులు మెట్రోరైల్ అలైన్‌మెంట్‌పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. మెట్రోరైల్‌పై పలు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ప్రదర్శించారు. వీరికి టీడీపీ సభ్యులు మద్దతు తెలుపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. ఈ సమయంలో సభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీష్‌రావు జోక్యం చేసుకొని, ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని సూచించారు. అయినా సభ్యులు పట్టువీడకపోవడంతో ప్రశ్నోత్తరాల్లోని ఐఎంజీ భూముల అంశాన్ని తప్పించుకునేందుకే బీజేపీ, టీడీపీలు సభను అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే సమయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ‘నిన్న పొన్నాల లక్ష్మయ్య బండా రం బయటపడింది. నేడు చంద్రబాబు సంగతి బయటపడుతుందనే నాటకాలు ఆడుతున్నారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో మరింత గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలమధ్య స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితిలో మార్పులేకపోవడంతో సభను మరో పది నిమిషాలు వాయిదా వేశారు.
అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం: సీఎం
సభ తిరిగి ప్రారంభం అయ్యాక సైతం బీజేపీ, టీడీపీలు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. దీంతో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ‘గ్రీన్‌ల్యాండ్స్-జూబ్లీహిల్స్ మెట్రోరైల్ మార్గంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. దీనిపై సీఎస్ సహా ఇతర అధికారులతో చర్చిస్తున్న సమయంలోనే ఓ శాసనసభ్యుడు యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నారు తప్పితే, చర్చల్లో పాల్గొనలేదు. శాసనసభ మీదుగా అమరుల స్తూపంపై పోతున్న లైను, సుల్తాన్ బజార్‌ను ధ్వంసం చేసే ఉమెన్స్ కాలేజీ లైను, పాతబస్తీ ప్రార్థనా మందిరాల గుండాపోతున్న లైన్లపై మార్పు చేద్దామని ఆలోచనలు చేస్తున్నాం. శాసనసభ ముగిశాక దీనిపై జంట నగరాల అన్ని పార్టీల శాసనసభ్యులతో సమావేశంపెట్టి ఎల్‌అండ్‌టీ సంస్థతో మాట్లాడి నిర్ణయం చేద్దాం’ అని సూచించారు. సీఎం ప్రకటనతో ఇరుపార్టీల సభ్యులు శాంతించారు.
నేడు బడ్జెట్‌కు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌కు శుక్రవారం శాసనసభ ఆమోదం తెలపనుంది. జూన్ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన వ్యయానికి, డిసెంబర్ రెండో తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు నిధుల వ్యయం కోసం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకు వస్తోంది. మొత్తం రూ. 1,00,648 కోట్లకు శాసనసభ ఆమోదం తెలపాల్సి ఉంది. శుక్రవారం శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే దానిని గవర్నర్ నరసింహన్ అనుమతి కోసం పంపిస్తారు. గవర్నర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే.. ఆర్థిక శాఖ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం, నిధుల వినియోగానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ఉత్తర్వుల జారీ అనంతరం డిసెంబర్ రెండో తేదీ నుంచి శాసనసభ ఆమోదించిన మేరకు నిధులు వినియోగించుకోవడానికి వీలవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి బడ్జెట్‌నే లక్ష కోట్లకు పైగా పెట్టడం గమనార్హం.
‘మెట్రో’ మార్పుపై చర్చకు బీజేపీ పట్టు
Published Fri, Nov 28 2014 2:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement