
స్నేహం పేరిట బ్లాక్‌మెయిల్
అతడిది ఆకట్టుకునే అందం.. ఖరీదైన డ్రెస్సులు.. అదిరిపోయే బైక్.. ఐ ఫోన్.. మల్టీమీడియాలో దిట్ట..
⇒ స్నేహితురాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
⇒ వారి స్నేహితులతోనూ పరిచయాలు
⇒ అసభ్యకర ఫొటోలు చూపించి బెదిరింపులు..
⇒ రూ.లక్షల్లో వసూలు చేసి జల్సాలు
సాక్షి, జగిత్యాల: అతడిది ఆకట్టుకునే అందం.. ఖరీదైన డ్రెస్సులు.. అదిరిపోయే బైక్.. ఐ ఫోన్.. మల్టీమీడియాలో దిట్ట.. ఇలా తనకున్న ప్రత్యేకతలతో అమ్మాయిలకు స్నేహం పేరిట వల వేశాడు. వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. ఇలా రూ. లక్షల్లో వసూలు చేశాడు. ఓ యువతి ఫిర్యాదు చేయడంతో జగిత్యాల పోలీసులు ఆ మాయలోడిని అరెస్టు చేశారు. కేసు వివరాలను జగిత్యాల సీఐ ప్రకాశ్ శుక్రవారం విలేకరులకు వివరించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన కసాడి మల్లయ్య కుమారుడు కసాడి వంశీకృష్ణ(21) జగిత్యాలలో 9వ తరగతి చదివాడు. పై చదువుల కోసం కరీంనగర్, హైదరాబాద్ వెళ్లాడు.
ఈ క్రమంలో జగిత్యాలలో తాను చదివిన అమ్మాయిలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ అమ్మాయిల ద్వారా వారి స్నేహితురాళ్లనూ ఫోన్లో పరిచ యం చేసుకుని వారినీ గ్రూప్‌లో చేర్చాడు. వారిలో ఒక్కొక్కరిని వేర్వేరుగా కలుస్తూ.. వారిలో కొందరితో అసభ్యంగా ఫొటోలు దిగాడు. మరికొన్నింటిని తనకున్న మల్టీమీడియా పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేశాడు. సదరు ఫొటోలను అమ్మాయిల తల్లిదం డ్రులకు చూపిస్తానని, నెట్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడు.
అమ్మాయిల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు.. కెమెరా.. విలువైన మొబైల్ రాబట్టాడు. వచ్చిన డబ్బులతో హైదరాబాద్, గోవాలో జల్సా చేశాడు. ఇతని ఆగడాలు భరించలేక ఓ బాధిత యువతి ఈ నెల 5న నేరుగా జిల్లా ఎస్పీ అనంతశర్మను కలిసింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలో దిగిన సీఐ ప్రకాశ్ బృందం శుక్ర వారం బస్టాండ్ ప్రాంతంలో వంశీకృష్ణను అరెస్టు చేసింది. విచారించగా.. ఇప్పటి వరకు 15 మందిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఒప్పుకున్నాడు.