కర్నూలు: వాట్సాప్ గ్రూపులో ఫొటో పోస్టు చేసిన విషయం రెండు వర్గాల మధ్య దాడికి దారితీసింది. మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పీరుసాహెబ్ పేటలో ప్రతి ఏటా వినాయకుడిని ప్రతిష్ఠించి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. విగ్రహం వద్ద వడ్డె ఎల్లశ్రీనివాసులు, బోయ వెంకట మద్దిలేటి కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను వడ్డె ఓబన్న యూత్ వాట్సాప్ గ్రూపులో ఎల్లశ్రీనివాసులు పోస్టు చేశారు.
వేరే కులస్తుడితో దిగిన ఫొటోను ఎలా గ్రూపులో పోస్టు పెడతావని అదే గ్రూపులో ఉన్న గ్రామానికి చెందిన సంపంగి శివకృష్ణతో పాటు మరికొందరు వడ్డె ఎల్లశ్రీనివాసులుతో సోమవారం వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మిడుతూరు ఏఎస్‌ఐ సుబ్బయ్య ఘటనా స్థలానికి వెళ్లి గొడవకు పాల్పడిన వారిని విచారించారు. జరిగిన ఘటనపై మంగళవారం ఉదయం స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఎల్లశ్రీనివాసులు, రమణమ్మ, వెంకటనరసమ్మ, మహేశ్వరమ్మ మిడుతూరుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన కుంచెపు మద్దిలేటి, కుంచెపు బొబ్బిలితో పాటు మరికొందరు ఫిర్యాదుదారులపై స్టేషన్‌లో దాడికి దిగారు. ఈ ఘటనలో ఫిర్యాదుదారులకు గాయాలు కావడంతో పాటు స్టేషన్ జీపు అద్దాలు సైతం ధ్వసమయ్యాయి.
క్షతగాత్రులను పోలీసులు మిడుతూరు సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. విషయం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్‌ఐ నాగార్జున స్టేషన్‌కు చేరుకుని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనపై ఇరువర్గాలకు చెందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లశ్రీనివాసులు వర్గానికి చెందిన మాధవస్వామి ఫిర్యాదు మేరకు 11 మంది( సంపంగి శివకృష్ణ, కుంచెపు రామకృష్ణ, వెంకటరమణ, మద్దిలేటి, బొబ్బిలి, మధుకుమార్, మధుగోపాల్, మధుమోహన్, మధుక్రిష్ణ, శివమధు, మహేశ్వరి)పై, ప్రత్యర్థి వర్గానికి చెందిన రాములమ్మ ఫిర్యాదు మేరకు ఐదుగురి (ఎల్లశ్రీనివాసులు, మహేశ్వరి, రాజు, అంజి, మారెమ్మ)పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుబ్బయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment