
రైస్ మిల్లర్లపై సీఐడీ నజర్!
- బోధన్ స్కాంలో 300 మంది రైస్‌మిల్లర్ల పాత్ర
- వారిని విచారించాలని భావిస్తున్న సీఐడీ
- ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు!
- ఏ1 నిందితుడు శివరాజ్‌తో వారికి ఆర్థిక సంబంధాలు
- ఉన్నతాధికారులకు సీఐడీ ఫిర్యాదు.. ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్
వాణిజ్య పన్నుల విభాగం బోధన్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలాన్ల కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంలో పాత్రధారులుగా 300 మంది రైస్‌మిల్లర్లు ఉన్నారని, వారిని విచారించాలని సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న శివరాజ్ పలువురు ప్రజాప్రతినిధులకు సన్నిహితుడని కూడా గుర్తించింది. అయితే రైస్‌మిల్లర్లకు, శివరాజ్‌కు సన్నిహితులైన ఓ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ కేసు విచారణపై ప్రభావం చూపేలా ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.
రైస్ మిల్లర్లూ బాధ్యులే..
నకిలీ చలాన్లు సృష్టించి, ట్యాక్స్ చెల్లించినట్టు చెప్పుకుంటున్న 300 మంది రైస్‌మిల్లర్ల పాత్రపైనా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. 2005 నుంచి ఇప్పటివరకు వారు నయా పైసా చెల్లించకున్నా.. చెల్లించేసినట్లు శివరాజ్ వారికి చలాన్లు సృష్టించి ఇచ్చినట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇక నిజామాబాద్‌లోని పలువురు ఎమ్మెల్యేలకు కొంత మంది రైస్‌మిల్లర్లు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారనీ భావిస్తున్నారు.
నాయకులతో ఏమిటీ లింకు..?
సదరు ఎంపీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రైవేటు ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్‌తో ఉన్న లింకులపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఏటా ఐటీ చెల్లింపులు, ట్యాక్స్‌ల వ్యవహారం వంటి వాటన్నింటిలో వారికి శివరాజ్ సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నోట్ల రద్దు సమయంలోనూ ఓ ఎంపీ, మాజీ ఎంపీలకు శివరాజ్ నోట్లు మార్పిడి చేసి పెట్టినట్లు సీఐడీ అధికారులు సందేహిస్తున్నారు. అంతే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల ఆర్థిక వ్యవహారాలను శివరాజ్ చక్కబెట్టేవాడని భావిస్తున్నారు. అందుకే ఆ ఎంపీ, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ కేసు దర్యాప్తుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించారని, ఇంటలిజెన్స్ అధికారులు నివేదిక రూపొందించే పనిలో ఉన్నారని సమాచారం.
ప్రభుత్వం వైపు నుంచీ ఒత్తిడికి యత్నం
ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి తమపై వస్తున్న ఒత్తిళ్లు వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కుంభకోణంలో ఎవరినీ వదలిపెట్టలేమని వారికి స్పష్టం చేశామని చెబుతున్నారు. దీంతో ఆయా నేతలు ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.