సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం బోనమెత్తింది. బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌లో తొట్టెల ఊరేగింపును రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక అమ్మవారు తొలి పూజ అందుకున్నారు. మంత్రులు అమ్మవారికి బంగారు, వెండి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు పూజలు చేస్తున్నారు. మహిళల ప్రత్యేక పూజలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపుతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. చారిత్రక ఉత్సవంగా పేరొందిన బోనాల పండగను వైభవంగా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం..ఇటు ఆయా ఆలయాల కమిటీలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. గోల్కొండలో నెలరోజులపాటు ప్రతి గురు, ఆదివారాల్లో జగదాంబిక అమ్మవారు 9 పూజలు అందుకోనున్నారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల సందర్భంగా 2,845 దేవాలయాలకు ప్రభుత్వం తరఫున 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. గోల్కొండ దేవాలయానికి 10 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పడాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment