హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది
* కేక్ కట్ చేయాలని పిలిచి.. భవనంపై నుంచి తోసేసిన ప్రియుడు
హైదరాబాద్: ప్రేమోన్మాదుల దాడికి యువతులు బలవుతూనే ఉన్నారు. తనను ప్రేమించడం లేదని సోమవారం ఓ ఉన్మాది రవళిని కత్తితో దాడి చే సిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమె పుట్టినరోజు నాడే హతమార్చేందుకు కుట్ర చేశాడు. కేక్ కట్ చేయాలంటూ భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా తోసేశాడు. అదృష్టవశాత్తు సిమెంట్ రేకులపై పడడంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకలగూడ చింతబావికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గడ్డం శ్రీశైలం పెద్దకుమార్తె రూప (21). పదవ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. జీడిమెట్ల గాజులరామారానికి చెందిన మహ్మద్ సాజిద్ (24)తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. సాజిద్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
పథకం ప్రకారం వచ్చి...
మంగళవారం రూప పుట్టిన రోజు కావడంతో అదేరోజు ఆమెను హతమార్చేందుకు సాజిద్ పథకం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగా సాయంత్రం రూప ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలని ఆమెను అపార్ట్‌మెంట్(మూడంతస్తుల భవనం)పైకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తనను నిర్లక్ష్యం చేస్తున్నావని ఆగ్రహించిన సాజిద్.. రూప ను బలవంతంగా అక్కడి నుంచి నెట్టివేశాడు.
రేకుల షెడ్‌పై పడడంతో రూప తల, మెడకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, సాజిద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రస్తుతం రూపకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న తనను నిర్లక్ష్యం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉండడం భరించలేకే రూపను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు సాజిద్ పోలీసులకు తెలిపాడు. కాగా, సోమవారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బీటెక్ విద్యార్థిని రవళి కూడా సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.