వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మేళతాళాలతో స్వామివారల ఉత్సవమూర్తులను ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించి కల్యాణ మంటపానికి తీసుకొచ్చారు.
- రేపు పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం
వేములవాడ (కరీంనగర్ జిల్లా) : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాజన్న బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మేళతాళాలతో స్వామివారల ఉత్సవమూర్తులను ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించి కల్యాణ మంటపానికి తీసుకొచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులకు దేవస్థానం పక్షాన వర్ని-దీక్షా వస్త్రాలు అందజేశారు. అనంతరం 7.35 గంటలకు స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ సారథ్యంతో అర్చకులు కళ్యాణ మండపంలో భేరీపూజ, దేవతాహ్వానం, నీరాజనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.40 గంటలకు అభిజిత్ లగ్న ముహూర్తమున పార్వతీరాజరాజేశ్వరస్వామి వారల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి 8 గంటలకు పెద్దసేవపై ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుందని అర్చకులు తెలిపారు. స్థానిక నగరపంచాయతీ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చైర్‌పర్సన్ నామాల ఉమ, కమిషనర్ శ్రీహరి శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు.