అంతొస్తోందిగా.. ఎంతిస్తావు.? | Bribe to the Foreign Vidyanidhi Scheme | Sakshi
Sakshi News home page

అంతొస్తోందిగా.. ఎంతిస్తావు.?

Published Mon, Apr 16 2018 1:34 AM | Last Updated on Mon, Apr 16 2018 1:35 AM

Bribe to the Foreign Vidyanidhi Scheme - Sakshi

‘కంగ్రాట్స్‌ బాబు.. విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికయ్యావు. రూ.20 లక్షలొస్తాయి. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఇంత డబ్బు వస్తోంది కదా? మరి నాకెంత ఇస్తావ్‌?  ఓసారి ఆలోచించి నా వాటా తేల్చేయ్‌’    – లబ్ధిదారునితో ఖమ్మం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఓ అధికారి అన్న మాటలివి.

సాక్షి, హైదరాబాద్‌
: విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కలను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకంతో సాకారం చేస్తోంది. ఏటా 1,000 మందికి అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. 2015–16 వరకు ఎస్సీ, ఎస్టీలకే పథకం అమలవగా తర్వాత బీసీ, ఈబీసీ, మైనారిటీలకు అందుబాటులోకి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం.. బీసీ, ఈబీసీలకు మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ విద్యానిధి పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు.

ఆయా సంక్షేమ శాఖల వారీగా పథకాలు అమలవు తున్నాయి. విద్యార్థుల ఎంపిక రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నతాధి కారుల సమక్షంలో పక్కాగా జరిగినా.. నిధులు మాత్రం జిల్లా స్థాయి నుంచి ఇస్తున్నారు. ఈ తంతే విద్యార్థులకు గుదిబండగా మారుతోంది. వాటా ఇవ్వందే నిధులు ఇవ్వమంటూ కొందరు సంక్షేమ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది కాలయాపన చేస్తున్నారు. విధిలేని పరిస్థితిలో వారు అడిగిన మొత్తానికి ఒప్పుకోవాల్సి వస్తోంది. 

ఎంపిక ఇలా.. పంపిణీ అలా..
విదేశాల్లో పీజీ చేయాలనుకున్న విద్యార్థి తొలుత విద్యానిధి పథకం కింద ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత నిర్దేశిత తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ చేసి అర్హత నిర్ధారిస్తారు. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ సంచాలకులు, సంయుక్త సంచాలకుల సమక్షంలో ప్రక్రియ పక్కాగా జరుగుతుంది. అనంతరం అర్హుల పేర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

అర్హత సాధించిన విద్యార్ధి నిర్దేశిత వర్సిటీలో ప్రవేశం పొందిన తర్వాత సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి తనిఖీ అధికారులు విద్యార్థి వాస్తవ పరిస్థితిని సమీక్షిస్తారు. మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అనంతరం విదేశీ వర్సిటీలో ప్రవేశ పత్రాలు, మార్కుల మెమోల ఆధారంగా ఆర్థిక సాయం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉత్తీర్ణులయ్యాక తొలి విడత రూ.10 లక్షలు, రెండో సంవత్సరంలో సెమిస్టర్‌ పరీక్షల సమయంలో మిగతా రూ.10 లక్షలు చెల్లిస్తారు.



10 శాతం ఇచ్చుకోవాల్సిందే!
ఎలాంటి పూచీకత్తు లేకుండా అర్హత, ప్రతిభ ఆధారంగా విద్యానిధి పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధికారులు.. వాటాలు ఆర్జిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలోనే విద్యార్ధి కుటుంబ సభ్యులతో బేరం మాట్లాడుకుంటున్నారు. 5 నుంచి 10 శాతం డిమాండ్‌ చేస్తూ రేటు ఫిక్స్‌ చేస్తున్నారు. తొలి, రెండో విడత చెల్లింపుల సమయంలో సొమ్ము అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కమీషన్‌ ఇస్తేనే నిధుల జమకు మార్గం సుగమమవుతుంది. లేదంటే ఫైలుకు కొర్రీలేస్తూ నిధుల విడుదలలో జాప్యం చేస్తారు. ఇలా ఏటా రూ.10 కోట్ల వరకు కమీషన్ల రూపంలో లబ్ధిదారులు నష్టపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement