శిథిలాల కింద పడి మృతిచెందిన వీరన్న
హైదరాబాద్: చందానగర్ హుడా కాలనీలో పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబు ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ హఫీజ్‌పేట్ డివిజన్‌లోని హుడాకాలనీలో నివాసముండే రాంచందర్ తన ఇంటిని పునర్నిర్మాణం చేయడానికి కూల్చివేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాంట్రాక్టర్ యాదగిరి ఐదుగురు కూలీలతో పురాతన భవనాన్ని పనులను ప్రారంభించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మాల్యాల సాదుతండాకు చెందిన వీరన్న (45), జనగామవాసి సిద్దులు (30) పాపిరెడ్డి కాలనీలో నివాసముంటూ, కూలి పనులను చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు మరో ముగ్గురితో కలసి కూల్చివేతలు చేపట్టారు. సాయంత్రం 4.30 ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గోడ, స్లాబు కుప్పకూలిపోయాయి. గోడ పక్కనే ఉన్న వీరన్న తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న సిద్దులుకు తీవ్ర గాయాలయ్యాయి.
జీహెచ్‌ఎంసీ అధికారులు గాయపడిన సిద్దులును స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుడు వీరన్నకు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సిద్దులుకు భార్య యాదమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. అనుమతి లేకుండానే పురాతన భవనాన్ని కూల్చివేసే పనులను యజమాని చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ధారించారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి, ప్రభుత్వం ద్వారా పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన
మృతుడు వీరన్న కుటుంబసభ్యులు ఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. పెద్ద దిక్కు కోల్పోయి పిల్లలతో ఎలా బతకాలని మృతుడి భార్య, పిల్లలు రోదించడం అందరినీ కలచి వేసింది. నిరుపేదలైన వీరన్న కుటుంబసభ్యులను ప్రభుత్వం, ఇంటి యజమాని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment