బీఎస్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియకు అనుమతి | BS Ltd allowed for bankruptcy process | Sakshi
Sakshi News home page

బీఎస్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియకు అనుమతి

Published Sun, Nov 11 2018 2:59 AM | Last Updated on Sun, Nov 11 2018 2:59 AM

BS Ltd allowed for bankruptcy process - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి తీసుకున్న కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో విద్యుత్‌ పంపిణీ, సరఫరా, టెలిఫోన్‌ ఆధారిత సేవల్లో ప్రముఖ కంపెనీ అయిన బీఎస్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతినిచ్చింది. తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్‌పీ) డాక్టర్‌ కె.వి.శ్రీనివాస్‌ను నియమించింది.

ఈ మేరకు ట్రిబ్యునల్‌ సభ్యులు కె.అనంత పద్మనాభస్వామి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. బీఎస్‌ లిమిటెడ్‌ 2010–15 వరకు ఎస్‌బీఐ నుంచి దశల వారీగా రూ.5 వేల కోట్లకు పైగా రుణం తీసుకుంది. తీసుకున్న రుణంలో కొంత చెల్లించిన బీఎస్‌ లిమిటెడ్, ఎస్‌బీఐకి రూ. 924.88 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయి చెల్లించడంలో బీఎస్‌ లిమిటెడ్‌ విఫలం కావడంతో ఆ కంపెనీపై ఎస్‌బీఐ హైదరాబాద్‌లోని ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. బీఎస్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఎస్‌బీఐ కోరింది. రుణ బకాయి వసూలు నిమిత్తం ఎస్‌బీఐ ఇప్పటికే డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) ముందు సర్ఫేసీ చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేసిందని బీఎస్‌ లిమిటెడ్‌ వివరించింది.

ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం..
ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్‌ సభ్యులు పద్మనాభస్వామి బీఎస్‌ లిమిటెడ్‌ వాదనలను తోసిపుచ్చారు. ఎస్‌బీఐకి బకాయి ఉన్న విషయం వాస్తవమని, దీనిని తోసిపుచ్చేందుకు సరైన కారణాలేవీ కనిపించడం లేదన్నారు. ఎస్‌బీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటూ బీఎస్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియకు అనుమతినిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీఎస్‌ లిమిటెడ్‌ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించారు. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదన్నారు. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని, దివాలా ప్రక్రియకు సంబంధించి పత్రికా ప్రకటన జారీ చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement