సిరిసిల్లలో మరమగ్గాల మధ్య కార్మికుడు
తుది నివేదిక సమర్పించిన జౌళిశాఖ
- బడ్జెట్ కేటాయింపులే కీలకం
- రూ.11 కోట్లతో ప్రతిపాదనలు
- సిరిసిల్లలోనే అత్యధికంగా రూ.10 కోట్లు
సిరిసిల్ల : జిల్లాలో నేతన్నల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ మేరకు చేనేత జౌళిశాఖ అధికారులు సేకరించిన వివరాలు, తుది నివేదికను సర్కార్ కు అందించారు. దీంతో మరమగ్గాల కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీకి మార్గం సుగమమైంది. జిల్లావ్యాప్తంగా వ్యక్తిగత రుణాలు రూ.11 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క సిరిసిల్లలోనే రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
బ్యాంకుల ద్వారా వివరాల సేకరణ
జిల్లా వ్యాప్తంగా 38 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 33 వేల మరమగ్గాలు ఉన్నాయి. వస్త్రపరిశ్రమ సిరిసిల్ల కేంద్రంగా అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా నేతన్నలకు రుణభారం ఎక్కువై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేతన్నల రుణమాఫీకి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ మేరకు సుమారు 20వేల కుటుంబాలు రూ.11కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ఒక్క సిరిసిల్లలోనే రూ.పదికోట్ల రుణాలు ఉన్నట్లు స్పష్టమైంది.
వైఎస్ హామీని నెరవేర్చని పాలకులు
దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి నేతన్నల రుణమాఫీ కోసం 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.312 కోట్లతో బడ్జెట్ కేటాయించారు. నేతన్నలను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలన్న వైఎస్సార్ హామీని ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌లు పక్కదారి పట్టించాయి. కేవలం రూ.200 కోట్ల చేనేత కార్మికుల రుణాలు మాఫీచేశారు.
చేనేత అనే పదాన్ని అడ్డుపెట్టుకుని మరమగ్గాలకు రుణమాఫీ వర్తించదని మొండిచేయి చూపారు. బడ్జెట్‌లో కే టాయించిన నిధుల్లో రూ.112 కోట్లు మిగలగా.. వాటి ని మరమగ్గాల కార్మికులకు వర్తింపజేయాలని ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభలో ప్రస్తావించారు. ప్రభుత్వం పట్టిం చుకోకపోడంతో వైఎస్ హామీ అమలుకాలేదు.రుణమాఫీ అమలైతే సిరిసిల్లతోపాటు బోయినపల్లి, చొప్పదండి, నిమ్మపల్లి, గర్షకుర్తి, గన్నేరువరం, కొత్తపల్లి, చామనపల్లి ప్రాంతాలకు చెందిన ఇరవై వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.