
‘తన తప్పేమీ లేకపోయినా అనుకోని ఆపదకు గురై.. అతికష్టం మీద కోలుకుని బతుకుతున్న మనిషికి తోటి వారి నుంచి ఓదార్పు అందాలి. సాంత్వన లభించాలి. అప్పుడే ఆ చేదు జ్ఞాపకాల గాయం మానుతుంది. ఆ మనిషి జీవనయానం గాడిలో పడుతుంది. కానీ అలా జరగడం లేదు. మంటల్లో చిక్కుకుని చచ్చిబతికిన మనిషి కాలిన గాయాలకు మందు పూయాల్సిన సమాజం మరింతగా ఆ మంటను రాజేస్తోంది. చీత్కారపు చూపులతో కొందరు.. అంటరానివారుగా చూస్తున్నవారు మరికొందరు. శరీరం కాలిన మనిషి బాధను రెట్టింపు చేస్తూ మనసునూకాల్చేస్తున్నారు. తమ తప్పేమీ లేకపోయినా సమాజం ఎందుకిలా ఈసడించుకుంటోంది.. తమను ఇంతలా దూరం ఎందుకు పెడుతోంది? చావకుండా బతికి ఉండడమే మా తప్పా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బర్నింగ్ బాధితులు. కాలిన గాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతూ సమాజం వివక్షకు గురవుతున్న వ్యధార్త జీవిత యథార్థ గాథలెన్నో.. ఎన్నెన్నో.
హిమాయత్‌నగర్ :నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో హాస్టల్ ఉండటానికి అనేక ఇబ్బందులు పడ్డాను. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా నా రూమ్‌మేట్స్ డోర్ లాక్ చేశారు. క్యాబ్ ఎక్కేందుకు రోడ్డుపైకి వెళ్తుండగా నా ముఖ ఆకారాన్ని చూసి ఓ చిన్నపిల్లాడు రాయి తీసుకుని కొట్టాడు. ఆ సమయంలో చచ్చిపోవాలన్నబాధ కలిగింది. మాలాంటివారికి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలిచ్చేందుకు సైతం వెనకాడుతుండటం వివక్షకు అద్దం పడుతోంది. ఒళ్లు కాలిన వారు మనుషులు కాదా? సాటి మనిషిని మరో మనిషిలా చూడకపోవడం, గుర్తించకపోవడం చాలా బాధగా ఉంటోంద’ని ఆవేదన వ్యక్తంచేశారు ‘బర్న్ సర్వైవర్ మిషన్, సర్వైవర్ ట్రస్ట్’వ్యవస్థాపకురాలు నిహారీ మండలి.
ఉద్యోగం ఇవ్వలేమని బయటికి పంపించారు..
ఎనిమిదేళ్ల ప్రాయంలో అగ్ని ప్రమాదానికి గురయ్యాను. శరీరం 50శాతం కాలిపోయింది. దీంతో నన్ను స్కూల్లో దగ్గరకు రానిచ్చేవాళ్లు కాదు. కాలేజీలో అసహ్యంచుకునే వాళ్లు. అన్నీ ఎదుర్కొని మంచి మార్కులతో బీటెక్ పూర్తి చేసి ప్రొద్దుటూరు నుంచి హైదరాద్‌కు వచ్చాను. ఓ పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లాను. అన్ని రౌండ్స్‌లో సక్సెస్ అయ్యాను. ఇంటర్వ్యూ సమయంలో నేను ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నాను. అపాయిట్‌మెంట్ లెటర్ చేతికి ఇచ్చే సమయంలో స్కార్ఫ్ తీయమన్నారు. నా ముఖం చూసిన తర్వాత ‘సారీ నీలాంటి అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేం. ఇస్తే మిగతా వాళ్లు చేయలేరు’ అంటూ బయటకు పంపించారు. – వరప్రసన్న లక్ష్మి, ప్రొద్దుటూరు
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా పది లక్షల మంది అగ్ని ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో కొందరు వంట చేసేటప్పుడు గ్యాస్ లీకై, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పొలాల్లో గడ్డి కోసేటప్పుడు కరెంట్ షాక్‌కు గురై, కరెంట్ స్తంభాలపై మరమ్మతులు చేస్తూ, యాసిడ్ దాడికి గురై, దురదృష్టవశాత్తు ఇళ్లు దగ్ధమై.. ఇలా పలు ఘటనల్లో మంటల్లో చిక్కుకున్న బాధితులుకు సరైన శస్త్రచికిత్స అందక ప్రతి ఏటా అక్షరాలా 1.4 లక్షల మంది మృత్యువాత పడుతుండగా.. 2.4 లక్షల మంది వైకల్యంతో బతుకీడుస్తున్నారు.
రూ.2,933 కోట్లు విడుదలైనా..
కాలిన గాయాల బారిన పడి వైకల్యంతో బాధపడేవారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వారి దీనస్థితిని చూసి దేశవ్యాప్తంగా ఉన్న 150 ప్రభుత్వ ఆస్పత్రుల్లో, అన్ని జిల్లాల వైద్యశాలల్లో బర్న్ ఎక్వీప్‌మెంట్ ఉండాలని, స్పెషల్ బర్న్ వార్డ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో కేంద్రప్రభుత్వం 2015లో ‘నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెంటేషన్ ఆఫ్ బర్న్ ఇంజ్యూరీస్’ ద్వారా రూ.2,933 కోట్లు విడుదల చేసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ నిధులతో అవసరమైన కొన్ని హాస్పిటల్‌లు మినహా ఇతర వాటిలో బర్న్ ఎక్వీప్‌మెంట్ ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ప్రత్యేకంగా బర్న్ వార్డ్ కూడా ఏర్పాటు చేయలేదు.
ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి..
కాలిన వారి కోసం ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డ్ ఉంటుంది, ఎక్వీప్‌మెంట్ ఉంటుంది. సరైన రీతిలో ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. దీనికి అగ్నిమాపక శాఖ సహకరించాలి. 5కే, 2కే రన్, సెమినార్‌లు లాంటివి నిర్వహించాలి. శరీంరం కాలిపోయిన వారికి బతుకుపై ఆసక్తిని కలిగించాలి. సమాజంలో సాటి మనుషులుగా> గుర్తించే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికీ కలిగేలా పూర్తిస్థాయిలో అవగాహన ర్యాలీలు, సదస్సులు చేపట్టాలి. శరీర భాగాలు కాలిన బాధితులను దివ్యాంగులుగా గుర్తించాలి.
సాటి మనుషులుగా గుర్తించండి..
మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలేదు. మా తలరాత బాగోక కాలిపోయాం. కాలక ముందు.. కాలిన తర్వాత జీవితం చాలా వేరు. మా బతుకు మేం బతుకుతామన్నా ఈ సమాజం బతకనివ్వట్లేదు. హాస్టల్‌లో ఉండనివ్వట్లేదు. ఇల్లు అద్దెకు ఇవ్వట్లేదు. ముఖానికి స్కార్ఫ్ లేకుండా బయటకు వస్తే గ్రహాంతర వాసుల్లా చూస్తూ రాళ్లతో కొడుతున్నారు. ఎందుకు మాపై ఈ వివక్ష? మా జీవితాన్ని మేం బతుకుతాం. మేమూ మనుషులమే. మమ్మల్ని సాటి మనుషులుగా గుర్తించండి ప్లీజ్.– నిహారీ మండలి
Comments
Please login to add a commentAdd a comment