
కుందేలు.. వనవాసం
దేవరకొండ: చందంపేట మండలం కొత్తపల్లి గ్రామపరిధిలో జరిగిన ఈ సంఘటన పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. కొత్తపల్లి గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. చుట్టూ కొండలు, గుట్టలు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఓ కుందేలు గ్రామ పరిధిలోని మెగావత్‌తండాలో హల్‌చల్ చేసింది. తండాలో అటూ ఇటూ పరుగెత్తడం, బిత్తర చూపులు చూడటాన్ని పలువురు తండావాసులు గుర్తించారు. ఈ విషయమై తండావాసులు మాట్లాడుకునే లోపే అదే కుందేలు తండాకు సమీపంలో ఉన్న కొత్తపల్లి గ్రామంలోకి కూడా చొరబడింది. గ్రామంలో అక్కడక్కడా గ్రామస్తులకు కనిపించింది. ఇది గ్రామ, తండా ప్రజలకు వింతగా తోచింది. కుందేలు ఊళ్లోకి రావడం ఏంటని అందరూ నోళ్ళు నొక్కుకున్నారు. అరిష్టంగా భావించారు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన వరికుప్పల ఇద్దమ్మ అనే మహిళ మృతి చెందింది.
ఈ మూడు రోజుల కాలంలోనే గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణతండాకు చెందిన మంగ్లా అనే వ్యక్తి గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించాడు. ఈ రెండు ఘటనలూ వారిని మరింత కలవరానికి గురి చేశాయి. ఊరంతా ఒక్కటయ్యింది. ఇటు కుందేలు రావడం..వరుస మరణాలు వారికి మరింత కీడు చేస్తాయేమోనన్న భావనను కలిగించాయి. దీనికి తోడు గత పదిహేను రోజుల కాలంలోనే ఆ గ్రామానికి చెందిన మరో ముగ్గురు కూడా మృతి చెందారు. 15 రోజుల కాలంలోనే ఒక్కసారిగా గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడటంతో ఊరంతా ఇది అరిష్టమేనన్నారు. ఈ కీడు తొలగాలంటే ఏం చేయాలని నలుగురినీ వాకబు చేశారు. దీనికి పరిష్కారం వనవాసమేనని భావించిన వారంతా గ్రామ సర్పంచ్ దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు. వనవాసం వెళ్ళాలన్నారు. మంచి జరుగుతుందంటే కాదనడమెందుకని ఆయన కూడా సరేనన్నారు. ఊరు, తండా అంతా ఏకమై గురువారం వనవాసానికి వెళ్లారు.
ప్రజల విశ్వాసానికి విలువనివ్వాలనే
గ్రామాల్లో ఇలాంటివి సహజం. అయితే కుందేలు వచ్చిందని వనవాసం వెళ్ళడం కంటే జనాల్లో మంచి జరుగుతుందంటే వనవాసమే వెళ్ళాలన్నప్పుడు కాదనడమెందుకు ? ప్రజల విశ్వాసానికి కూడా విలువనివ్వాలనే వనవాసం వెళ్ళడానికి టముకు వేయించా. కుందేలు రావడం మంచిదా... చెడ్డదా అని ఆలోచించడం కంటే ప్రజల్లో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడం ఇక్కడ ముఖ్యం కదా.
- లోకసాని కృష్ణయ్య, సర్పంచ్, కొత్తపల్లి