గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో నామినేషన్ల నుంచి ఎన్నికలు పూర్తయ్యేదాకా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.నర్సింహమూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 12న నామినేషన్ల పక్రియ మొదలై, 19న ముగుస్తుందని తెలిపారు. నామినేషన్‌కు వచ్చే అభ్యర్థులు 200 మీటర్ల ముందు వరకు కాన్వాయ్ నిలిపి, వంద మీటర్ల లోపు మూడు వాహనాలకు అనుమతి ఉందని, అక్కడి నుంచి కాలినడకన వచ్చి నామినేషన్ వేయాలన్నారు. నామినేషన్ మొదలు, ఎన్నికల పక్రియ అంతా ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచే కొనసాగుతుందని వెల్లడించారు.
262 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. వీటిలో 1.81 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రామగుండం అర్బన్‌లో 210 పోలింగ్‌బూత్‌లు, అంతర్గాం27, పాలకుర్తి25 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు..
నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక రిటర్నింగ్ అధికారి, ముగ్గురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నలుగురు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) ఉంటారని వెల్లడించారు. వీరి నేతృత్వంలో మూడు ప్లయింగ్ స్క్వాడ్స్, మూడు వీడియో సర్వర్ లైన్స్ బృందాలు, వీడియో వీవింగ్ బృందాలు, అకౌంటెడ్ టీంలు, చెక్‌పోస్టు వద్ద మూడు స్టాటిక్ సర్వేలైన్స్ టీంలు(ఎస్‌ఎస్‌టీ) ఉండనున్నట్లు తెలిపారు. 262 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రానికి పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. ఇలా నియోజకవర్గంలో సుమారు 1,050 మందిని ఏర్పాటు చేశాం. మైక్రో అబ్జర్వర్లు 262 మంది, వెబ్ కాస్టింగ్ 262 మందితో పాటు అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పరిశీలించేందుకు షాడో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు...
ఎన్నికల్లో పోటీచేసే అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.28లక్షలుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. నామినేషన్ మొదలు ఎన్నికల ముందు రోజుదాకా ఖర్చుపై నిఘా ఉంటుంది. కౌంటింగ్ పూర్తియిన తర్వాత 30 రోజుల్లోగా ఖర్చుల వివరాలు సమర్పించాలి. దీనికోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని నామినేషన్ వేసిన అభ్యర్థులకు అందజేయనున్నట్లు చెప్పారు. లేకుంటే ఎన్నికల కమిషన్ నోటీస్ జారీ చేసి పోటీకి అనర్హునిగా ప్రకటించనుంది.
ఖర్చుపై ఐఆర్‌ఎస్ అధికారి నిఘా..
ఎన్నికల్లో చేసే వ్యయాలపై బెంగాల్‌కి చెందిన ఐఆర్‌ఎస్ అధికారి హెచ్‌ఎం.దాస్ ఈ నెల 12న ఇక్కడకు రానున్నట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి దీనికి సంబందించిన లెక్కలను పరిశీలించనున్నారు. ప్రతీ ఖర్చుకు సంబంధించి వీడియో చిత్రీకరణ ఉంటుందని, తాము పేర్కొన్న లెక్క ప్రకారం ప్రతీ లెక్క లిఖిత పూర్వకంగా అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో నలుగురు అనర్హులు
నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు నలుగురు అభ్యర్థులు అనర్హులుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించినట్లు రిటర్నింగ్ అధికారి నర్సింహమూర్తి తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వ్యయం సమర్పించక పోవడంతో 2020 వరకు పోటీ చేసే అవకాశాన్ని లేకుండా చేశారన్నారు.
200 మీటర్ల దూరంలో ర్యాలీ నిలిపివేత
నామినేషన్ సమర్పణకు వచ్చే అభ్యర్థులు నామినేషన్ సెంటర్‌కు 200మీటర్ల దూరంలోనే ర్యాలీ నిలిపివేయాలని సూచించారు. అక్కడి నుంచి వంద మీటర్ల దూరం వరకు మూడు వాహనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. తర్వాత కాలినడకన వచ్చి నామినేషన్ సమర్పించుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే అభ్యర్థితో సహా ఐదుగురు, ఇండిపెండెంట్ అయితే అభ్యర్థితో సహా 11 మందిని లోనికి అనుమతిస్తామని వివరించారు.
మీడియాకు నో ఎంట్రీ..
నామినేషన్ల పర్వాన్ని చిత్రీకరించేందుకు నామినేషన్ సెంటర్‌లోకి మీడియాకు అనుమతి లేదని రిటర్నింగ్ ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల నామినేషన్‌కు సంబంధించిన ఫొటోలను డీపీఆర్వో ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment