కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఖరారు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పది స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. హుస్నాబాద్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించగా, కోరుట్ల, హుజూరాబాద్‌ను పెండింగ్‌లో పెట్టింది. తాజాగా బుధవారం సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. కోరుట్ల, హుజూరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై ఇంకా సస్పెన్స్ నెలకొంది.
కాగా.. పేరు ఖరారైన వెంటనే సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి నామినేషన్ సైతం దాఖలు చేశారు. హుస్నాబాద్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి మహాకూటమి కేటాయించినా కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అటు హుజూరాబాద్‌లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా టిక్కెట్ ఆశిస్తున్న పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్ వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హుజూరాబాద్, కోరుట్ల అభ్యర్థులపై సస్పెన్స్..
కోరుట్లలో మాజీ మంత్రి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు పోటీ పడుతుండడంతో అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. టీడీపీకి ఆ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచించినా అక్కడి నుంచి పోటీ చేయడానికి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ విముఖత చూపారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థే అక్కడి నుంచి పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో టీజేఎస్ హుజురాబాద్‌ను కోరుతుండగా తెరచాటుగా టీడీపీ కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం. హుజూరాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించనందు వల్ల టీజేఎస్, టీటీడీపీల అభ్యర్థుల పేర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు మళ్లీ ఇక్కడి నుంచి వినిపిస్తోంది. కోరుట్ల టికెట్ దాదాపుగా జువ్వాడి నర్సింగరావుకు ఖరారైందన్న ప్రచారం జరగ్గా చివరి నిముషంలో వాయిదా వేయడంపై అక్కడ కూడా ఇదే రకమైన ప్రచారం వినిపిస్తోంది.
ఐదు నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులు.. చొప్పదండికి బొడిగె శోభ
భారతీయ జనతా పార్టీ ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన కొందరికీ మూడో విడత జాబితాలో అవకాశం కల్పించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో ఆరు, రెండో విడతలో ఇద్దరి పేర్లను ప్రకటించిన బీజేపీ అధిష్టానం.. మూడో విడతలో మిగిలిన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చొప్పదండి నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకురాలు బొడిగె శోభను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె తరఫున శోభ అనుచరులు బుధవారం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు.
ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న శోభ గురువారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అదేవిధంగా ఇటీవలే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన టీఆర్‌ఎస్ నేత, కమాన్‌పూర్ జెడ్పీటీసీ మేకల సంపత్‌యాదవ్‌కు మంథని, వేములవాడకు బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, హుస్నాబాద్‌కు చాడ శ్రీనివాస్‌రెడ్డి, హుజూరాబాద్‌కు పల్ల రఘు పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీగా బీజేపీ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment