
లక్డీకాపూల్: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులకు సీసీసీ వెన్నుదన్నుగా నిలిచింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న అసంఘటిత కార్మికుల విషయంలో ప్రముఖ నటుడు చిరంజీవి తీవ్రంగా స్పందించారు. కోటి రూపాయలు విరాళం ప్రకటించడంతో పాటు తోటి నటీనటులకు పిలుపునిచ్చారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ కరోనా క్రైసెస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసింది. మీ కోసం అంటూ సీసీసీ జీవనోపాధిని కోల్పోయిన సినీ కార్మికులకు ఆసరాగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం కార్మికులకే కాకుండా ఎంతో మంది నటీనటులకు సైతం సీసీసీ ఆసరాగా నిలిచింది. ఇందుకు సుమారుగా సీసీసీకి రూ.6.80 కోట్ల మేర విరాళాలు సమకూరాయి. నాగార్జున, వెంకటేష్, సురేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి ఎంతో మంది నటీనటులు ఆర్థిక సాయం అందించారు. ఇంకా అందిస్తున్నారు. దీంతో పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. ఈ విధంగా చిత్రపరిశ్రమకు చెందిన 12 వేల మంది కార్మికులకు సీసీసీ ఆసరాగా నిలిచింది.
దర్శక నిర్మాతలదే నిర్వాహణ..
సీసీసీ లక్ష్యాలు సక్రమంగా అమలయ్యే విధంగా దర్శకులు, నిర్మాతలు ఎన్.శంకర్, తమ్మారెడ్డి, సి.కళ్యాణ్, బెనర్జీ, దాములు పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ ప్రతి కార్మికుడికి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఏప్రిల్ మాసానికి సంబంధించి అందజేశారు. ఈ నెలకి కూడా ఆయా కార్మికులందరికీ సరుకులు అందిస్తున్నారు. సినీ పరిశ్రమలకు చెందిన గుర్తింపు కార్డు ఆధారంగా ఈ సాయాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలోని సినీ కార్మికులతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విశాఖపట్నంలోని కార్మికులకు, చెన్నైలోని తెలుగు పరిశ్రమకు చెందిన కార్మికులతో పాటుగా మా అసోసియేషన్‌కి చెందిన పలువురు సినీ నటులు, సాంకేతిక నిపుణులకు సైతం సీసీసీ చేయూతనిస్తోంది. సాయాన్ని సినీ కార్మికులకు నేరుగా మెహర్‌బాబా చారిటబుల్ ట్రస్టు ద్వారా అందజేస్తున్నారు.
సీనియర్ నటులకు సైతం..
పరిశ్రమలోని కొంతమంది సీనియర్ నటులకు కూడా సీసీసీ ఆసరాగా నిలిచింది. రెండు నెలలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సినీ రంగానికి చెందిన కార్మికులు, అవకాశాలు లేక జీవనోపాధిని కోల్పోయిన ఎంతో మంది నటులకు లాక్‌డౌన్ వేళ సాయం అందిస్తున్నాం. మొత్తం మీద 12,500మందికి సాయం చేస్తున్నాం. ఈ చేయూత కరోనా నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులకే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఏర్పడే ఇలాంటి విపత్తు సమయంలో కూడా కార్మికులను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీసీసీ ఉంది. రెండు మూడు రోజుల్లో కమిటీ సమావేశం కాబోతుంది. ఆ సమయంలో సీసీసీ భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తాం.– ఎన్.శంకర్, నిర్వాహకులు, సీసీసీ, ప్రముఖ సినీ దర్శకులు
బాగా చేస్తున్నారు..
కష్టకాలంలో సినీ పెద్దలు, యూనియన్లు ముందుకు వచ్చి ఆదుకోవడం చాలా బాగుంది. తెలుగు సినీ పరిశ్రమలలో ఇటీవల కాలంలో ఆసరా దొరుకుతోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి సీసీసీ బియ్యం, సరుకులు ఇచ్చి ఆదుకుంటోంది. అమితాబచ్చన్ కూడా దాదాపుగా లక్ష మందికి రూ.1500ల విలువైన బిగ్ బజార్ కూపన్లు ఇచ్చారు. ఇందుకు ఆయనొక్కడే రూ.15 కోట్లు వెచ్చించడం గొప్ప విషయం. బీహార్ రైతులందరికీ బ్యాంక్ రుణాలను చెల్లించారు. 1220మంది రైతుల రుణాలను ఆయనే చెల్లించారు. షూటింగ్‌లు లేకపోవడంతో ఇంట్లోనే పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నా. – రావి కొండలరావు, ప్రముఖ హాస్య నటుడు
భలే సాయపడుతోంది..
కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని సీసీసీ భలేగా సాయపడుతోంది. షూటింగ్‌లు లేక పరిశ్రమలోని ఎంతో మందికి చేయి ఆడని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను నేరుగా ఇంటి వద్దకే పంపించడం గొప్ప విషయంం. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో సాయం పొందేవాళ్లు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. అలాంటిది సీసీసీ మాత్రం రెండవ కంటి వారికి తెలియకుండా ప్రతి సభ్యుడి ఇంటికి సరుకులను పంపించి ఎంతో మంది కుటుంబాలకు అన్నం పెడుతోంది. – చలపతిరాజు, మాజీ అధ్యక్షుడు డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్
క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకున్నారు..
సినీ డ్రైవర్లది రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. లాక్‌డౌన్‌తో డ్రైవర్లంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నటుడు చిరంజీవి పెద్ద మనస్సు చేసుకుని కార్మికులను హక్కున చేర్చుకోవడం పట్ల కృతజ్ఞతలు. సీసీసీతో పాటుగా అమితాబచ్చన్ వంటి ప్రముఖులు సైతం ముందులకు వచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీరంతా నిలబడంతో డ్రైవర్లలో ధైర్యాన్ని నింపింది. దాంతో పాటు మా డ్రైవర్ల అసోసియేషన తరఫున డ్రైవర్లకు రూ.10వేల చొప్పున 800 మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందించాం. వీరితోపాటుగా ఏపీలోని మరో 75 మందికి కూడా ఈ సహాయాన్ని అందజేశాం– లడ్డూ బాషా, ప్రధాన కార్యదర్శి, సినీ డ్రైవర్స్ యూనియన్