చోరీ ఫోన్లకు ‘రెక్కలు’  | Cell Phones Thieves Are Sold Phones In Abroad | Sakshi
Sakshi News home page

చోరీ ఫోన్లకు ‘రెక్కలు’ 

Published Tue, Jun 12 2018 7:40 AM | Last Updated on Tue, Jun 12 2018 7:46 AM

Cell Phones Thieves Are Sold Phones In Abroad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యధాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది.ఆ తర్వాత కొన్నాళ్లకు తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్‌/క్లోనింగ్‌ చేసి వాడటం మొదలెట్టారు.ఇప్పుడు చోరీ చేసిన వాటిలో అత్యంత ఖరీదైన సెల్‌ఫోన్లను గుట్టుగా విదేశాలకు తరలించేస్తున్నారు.నగరంలో అపహరణకు గురవుతున్న సెల్‌ఫోన్లలో ఖరీదైనవి అత్యధిక భాగం బ్యాంకాక్, చైనాలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో ఉన్నవి సైతం ప్రధానంగా కర్ణాటకలోని గుల్బర్గా మార్కెట్‌కు వెళ్తున్నాయి.

ఫలితంగా వీటిని రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా దాదాపు లక్ష వరకు సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. రాజధానిలో అనేక ముఠాలు సెల్‌ఫోన్‌ పిక్‌పాకెటింగ్,  స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్ల చోరీ చేస్తున్నారు. బాధితు ల్లో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు.  

పర్సుల నుంచి సెల్‌ఫోన్ల వరకు... 
నగరంలోని పిక్‌పాకెటింగ్‌ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సులను మాత్రమే టార్గెట్‌ చేసేవి. అయితే క్రెడిట్, డెబిట్‌ కార్డుల వినియోగం పెరగడంతో వీరికి పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు.ఈ నేపథ్యంలో ఇటీవల వీరు సెల్‌ఫోన్లపై దృష్టి సారించారు. పీడీ యాక్ట్‌ ప్రయోగం వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్‌ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఐదుగురు సభ్యుల ముఠాను ముషీరాబాద్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరొకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్‌ వార్స్‌ జరిగి హత్యలకు దారి తీస్తున్నాయి.


గతంలో ఐఎంఈఐ నంబర్‌ మార్చేసి...   
ప్రతి మొబైల్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్యూప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌గా పిలిచే ఐఎంఈఐ నెంబర్‌ ఉంటుంది. మనిషి వేలిముద్రల తరహాలోనే ప్రపంచంలోని ఏ రెండు సెల్‌ఫోన్లకూ ఒకే నెంబర్‌ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్‌ ట్యాంపర్‌ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్‌ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్‌ కేటాయించేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్‌ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్‌ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్‌ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసే వారు. దీంతో సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. 


సరిహద్దులు దాటిస్తూ... 
తాజాగా చోరీ సెల్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్న, చోరీ చేస్తున్న వారి పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో ఒకడైన నజీరుద్దీన్‌ ఆరునెలల్లో దాదాపు నాలుగు సార్లు బ్యాంకాక్‌ వెళ్ళి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కోణంపై ఆరా తీయగా, తనతో పాటు మరికొందరు ‘ఐ–ఫోన్లను’ సరిహద్దులు దాటించేస్తున్నట్లు వెల్లడించాడు. ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్ల చొప్పున బ్యాంకాక్‌ తీసుకువెళ్లి అక్కడ మార్కెట్‌లో అమ్మేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నగరంలో జగదీష్‌ మార్కెట్‌ తరహాలోనే ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల మార్కెట్‌ ఉందని, అయితే అక్కడ ఐ–ఫోన్లకు మాత్రమే గిరాకీ ఉన్నట్లు వెల్లడించాడు. గుల్బర్గాలోని సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా పోలీసులు గుర్తించారు. ఇలా తరలిపోతున్న వాటిని ట్రాక్‌ చేయడం సాధ్యం కావట్లేదని చెబుతున్నారు.   


రిటర్న్‌ రూపంలో చైనాకు...
నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన చోరీ మాల్‌ వ్యాపారస్తులు సిండికేట్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణమైంది. ఇలా వచ్చిన మాల్‌లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్‌ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్‌ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్‌ చోరుల నుంచి ఖరీదు చేసిన ఖరీదైన హై–ఎండ్‌ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు భావిస్తున్నారు. రిటర్న్‌ మాల్‌లో గోప్యంగా దాచి పంపిస్తున్న నేపథ్యంలో కస్టమ్స్‌ అధికారులకూ చిక్కట్లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చోరీకి గురైన హై–ఎండ్‌ సెల్‌ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు.  

జాగ్రత్తలే మేలు... 
సెల్‌ఫోన్లను కోల్పోయిన సందర్భంలో బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు... చివరకు తల్లిదండ్రులు, భార్య ఫోన్‌ నెంబర్లు, అత్యంత కీలకమైన డేటాను సెల్‌లోనే ఫీడ్‌ చేసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కసారి ఫోన్‌ పోగొట్టుకుంటే... దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. విలువైన సమాచారం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌) ఉంటుంది. మెబైల్‌ ప్యాకింగ్‌ బాక్స్‌పైనా, అమ్మకం బిల్లుపైనా దీన్ని ముద్రిస్తారు. మీ సెల్‌ఫోన్‌లో (06) బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్‌ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్‌ చేసుకుని భద్రంగా ఉంచుకోవాలి. ఫోను పోయినప్పుడు దీన్నిబట్టి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. 

మీ సెల్‌ఫోన్‌ను సెక్యూరిటీ లాక్‌ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. దీనిని సెట్‌ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా... వినియోగించుకోవడం, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు. 

ప్రస్తుతం కొన్ని సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీలు, వెబ్‌సైట్స్‌ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్‌/స్టోర్‌ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిని వినియోగిం చుకోవడం ద్వారా మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకుంటున్న డేటా అంతా ఓచోట బ్యాకప్‌ అవుతుంది. దీని వల్ల ఫోన్‌ పోయినా... మీ డేటా సర్వర్‌లో సురక్షితంగా ఉంటుంది. 

ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లను కేవలం సెల్‌లో ఫీడ్‌ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తం డేటా కార్డు సాయంతో కంప్యూటర్‌లో, సీడీల్లో భద్రపరుచు కోవడం లేదా కీలక నెంబర్లన్నీ రాసి పెట్టుకోవడం మంచిది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement