సాక్షి, హైదరాబాద్: రైళ్ల సంఖ్య పెరగాలన్నా, వాటి వేగం పెంచాలన్నా ప్రతి మార్గంలో కనీసం రెండు లైన్ల మార్గం అవసరం. ఇంతకాలం రెండు లైన్ల మార్గాలు పూర్తిగా అందుబాటులోకి రాక తెలంగాణ పరిధిలో రైళ్ల సంఖ్య.. ఉన్న రైళ్ల వేగం పెరగని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కొరత తీరిపోతోంది. కొత్తగా రెండు ప్రధాన మార్గాలను రెండు లైన్లు (డబ్లింగ్)గా మార్చబోతుండటంతో, షిర్డీ మీదుగా ముంబై, తిరుపతి మీదుగా చెన్నై.. ఈ రెండు ప్రధాన మార్గాలకు ప్రత్యామ్నాయ రూట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఒకే రూట్‌పై పడుతున్న భారాన్ని తగ్గిస్తూ రెండు మార్గాల్లో రైళ్లను నడిపే వెసులుబాటు అందుబాటులోకి రాబోతోంది. దీనివల్ల దూరాభారం తగ్గడమే కాకుండా, ఆ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచేందుకు అవకాశం కలగబోతోంది. మరోవైపు, ప్రధాన ట్రంక్ రూట్లలో ఇక తెలంగాణవ్యాప్తంగా సింగిల్ లైన్లు ఉండవు. అన్నీ డబుల్ లైన్లుగానే ఉండనున్నాయి. ఈ ఘనతను మరో మూడేళ్లలో సాధించే అవకాశముంది. దీనికి సంబంధించి ఈ ఏడాది దాదాపు రూ.9 వేల కోట్లతో పనులు మొదలవుతున్నాయి.
ముంబైకి మరో మార్గం..
ప్రస్తుతం తెలంగాణ మీదుగా ముంబైకి ప్రధాన మార్గం వికారాబాద్–వాడీ లైను. ప్రధాన రైళ్లన్నీ ఈ మార్గం గుండానే వెళ్తున్నాయి. ముంబైకి నిజామాబాద్–బాసర మీదుగా సాగే ముద్ఖేడ్ లైన్ ఉన్నప్పటికీ ఇది సింగిల్ లైన్ కావటంతో ప్రధాన రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. షిర్డీకి కూడా ఇదే ప్రధాన మార్గం అయినా, సింగిల్ లైన్ కారణంగా ఎక్కువ రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. తాజాగా కేంద్రప్రభుత్వం అకోలా–డోన్ మార్గాన్ని రెండు లైన్లుగా మార్చాలని నిర్ణయించింది. 626 కి.మీ. మేర రెండో మార్గం నిర్మాణానికి రూ.6,260 కోట్లను మంజూరు చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో నగర శివారులోని బొల్లారం నుంచి నిజామాబాద్ మీదుగా బాసర దాటే వరకు డబుల్ లైన్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో హైదరాబాద్ నుంచి ముంబైకి రెండో ప్రధాన లైన్ అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా వాడీ రూట్‌పై భారం తగ్గుతుంది. డిమాండ్ అధికంగా ఉన్నందున ముంబైకి అదనంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు నడిపే వెసులుబాటు కలుగుతుంది. షిర్డీకి కూడా రైళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇదే డబ్లింగ్ ప్రాజెక్టులో మహబూబ్‌నగర్ నుంచి కర్నూలు వరకు (డోన్ వరకు కొనసాగుతుంది) కూడా రెండో లైను అందుబాటులోకి వస్తున్నందున ఆ మార్గంలో కూడా రైళ్ల సంఖ్య పెరుగుతుంది. బెంగళూరుకు అదనంగా రైళ్లు నడిపే అవకాశం కలుగుతుంది.
తిరుపతి, చెన్నైకి దగ్గరి దారి..
ఇక రెండో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడే ప్రధాన రూట్ తిరుపతి, చెన్నై. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాలంటే వరంగల్–విజయవాడ మీదుగా తిప్పుతున్నారు. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రాబోతోంది. బీబీనగర్–నల్లపాడు–నడికుడి–గుంటూరు మార్గాన్ని కూడా రెండు లైన్లుగా మార్చబోతున్నారు. 248 కి.మీ. మేర ఉండే ఈ మార్గంలో డబ్లింగ్ కోసం రూ.2,480 కోట్లు మంజూరయ్యాయి. హైదరాబాద్–వరంగల్ మార్గంలో బీబీనగర్ వరకు రెండు లైన్లున్నాయి. అక్కడి నుంచి నడికుడి మీదుగా గుంటూరు వెళ్లే మార్గంలో మాత్రం సింగిల్ లైన్ మాత్రమే ఉంది. ఫలితంగా ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్కువగా నడిపే అవకాశం లేకుండా పోయింది. చెన్నై వైపు వెళ్లే రైళ్లను గత్యంతరం లేక వరంగల్ మీదుగా నడుపుతున్నారు. ఆ మార్గంలో ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో డిమాండ్ ఉన్నా.. కొత్త రైళ్లను వేయలేకపోతున్నారు. ఇప్పుడు బీబీనగర్–నల్లపాడు మీదుగా ఉన్న సింగిల్ లైన్‌ను రెండుగా మారిస్తే చెన్నై, తిరుపతి వైపు ఇదో ప్రధాన మార్గం అవుతుంది. నిజానికి ఈ మార్గంలో వెళ్తే దాదాపు 70 కి.మీ. దూరం కూడా తగ్గుతుంది.
సింగిల్ లైన్‌తో ఇదే సమస్య..
సింగిల్ లైన్ మీదు గా వెళ్లేప్పుడు రైళ్ల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఒక ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుంటే దాని ముందు వెళ్లే, వచ్చే ఇతర రైళ్లను ముందు స్టేషన్లలో నిలిపి దారి ఇవ్వాల్సి వస్తోంది. ఈ రైలు దాటిపోతేగాని అవి తిరిగి కదిలే పరిస్థితి ఉండదు. దీంతో నిలిచిపోయే రైళ్ల ప్రయాణ సమయం పెరుగుతుంది. ఇలా ఆపాల్సి రావటంతో రైళ్ల సంఖ్య పెంచటం కుదరదు. ప్రస్తుతం బొల్లారం నుంచి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర వైపు, బీబీనగర్ నుంచి గుంటూరు మీదుగా తిరుపతి, చెన్నై వైపు ఇదే సమస్య ఉంది. ఇప్పుడు దాన్ని దూరం చేసే ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఆ పనులు వచ్చే మూడేళ్లలో పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment