‘ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) పథకం పరిధిలోకి తెచ్చిన వివిధ రాష్ట్రాల్లోని 99 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అందాల్సిన సహాయాన్ని నిర్ణీత సమయానికి అందజేస్తాం. నాబార్డ్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించిన రుణాలను ప్రణాళికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అందిస్తాం. ఆ మేరకు ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసే చర్యలకు రాష్ట్రాలు పూనుకోవాలి’.. మార్చి 30న ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా కేంద్రం చేసిన ప్రకటన ఇది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
సాయంపై అనేక మాటలు చెప్పిన కేంద్రం.. ఎప్పుడో విడుదల కావాల్సిన నిధులపై మాత్రం తాత్సారం చేస్తోంది. రాష్ట్రంలోని 11 ప్రాజెక్టులకు ఏకంగా రూ.9 వేల కోట్ల మేర సాయం అందిస్తామని చెప్పి.. ఇప్పటివరకు కేవలం రూ.547 కోట్లకే పరిమితం కావడం సాగు నీటి లక్ష్యాలను నీరు గారుస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్రాన్ని సంప్రదిస్తున్నా, అప్పుడు.. ఇప్పుడు అనే సమాధానమే తప్ప నిధులు మాత్రం విదల్చడం లేదు.
– సాక్షి, హైదరాబాద్
ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు..?
నిజానికి పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమరంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.25,027 కోట్లు అవసరం ఉండగా.. ఇప్పటికే 15,720.42 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.9,306.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిధులు సమకూర్చి ఆదుకోవాలని కోరింది. సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ కేంద్ర సాయం కింద రూ.1,108 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఇందులో 2016–17, 2017–18లో కలిపి మొత్తంగా కేంద్ర సాయం కింద రూ.1,194.63
కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా, గతేడాది రూ.547.63 కోట్ల సాయం అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.647 కోట్ల మేర నిధులు ఇంకా అందాల్సి ఉంది. ఇందులో ఒక్క దేవాదుల ప్రాజెక్టుకే రూ.496 కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు 11 ప్రాజెక్టులకు నాబార్డ్ కింద రూ.7,955 కోట్లు రుణం ఇచ్చేందుకు కేంద్ర అంగీకరించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.5,810 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు దీనిపైనా స్పష్టత లేదు.
కేంద్రం చేయూతనివ్వదే!
కేంద్ర సాయం చేసే భారీ ప్రాజెక్టులను నాలుగేళ్లలో, మధ్య తరహా ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయని పక్షంలో గడువును రెండుసార్లు మాత్రమే పొడిగిస్తుంది. తర్వాత కూడా జాప్యం చేస్తే మాత్రం నిధుల విడుదలను నిలిపివేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, భూసేకరణ సమస్యలు, పునరావాసం కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇదే విషయమై ఇటీవల నీటి పారుదల శాఖ అధికారులు.. సీడబ్ల్యూసీ పెద్దలను కలసి తమ ప్రాజెక్టులకు నిధుల అవసరాన్ని విన్నవించారు. అయితే నిధులు మాత్రం రాలటం లేదు. 11 ప్రాజెక్టుల్లో ఇప్పటికే మత్తడివాగు, ర్యాలివాగు పూర్తవగా, ఈ ఏడాది డిసెంబర్ కల్లా భీమా, ఎస్సారెస్పీ స్టేజ్–2, కొమరంభీం, గొల్లవాగు, పాలెంవాగులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిధులు సకాలంలో అందితేనే వాటిని పూర్తి చేయడం సాధ్యమవుతుంది. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులను సంప్రదించగా.. దేశవ్యాప్తంగా పీఎంకేఎస్‌వై పరిధిలోని 99 ప్రాజెక్టులకు రూ.9,020 కోట్ల నిధులను నాబార్డ్ ద్వారా 6 శాతం వడ్డీతో ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని, ఆ రుణాలపైనే ఆశలు పెట్టుకున్నామని వివరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment