సత్వర అనుమతులపై సమగ్ర చర్చ
* ప్రాజెక్టులపై నేడు ఢిల్లీలో జలవనరుల సమన్వయ కమిటీ భేటీ
* సభ్యుని హోదాలో పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు సత్వర అనుమతులు, నిధుల విడుదల వంటి అంశాల్లో తీసుకురావాల్సిన మార్పులపై శనివారం కేంద్ర జలవ నరుల సమన్వయ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) పథకం కింద దేశవ్యాప్తంగా ఎంపిక చే సిన 46 ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై ఈ కమిటీ చర్చిస్తుంది.
కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, సత్వర అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవడం, సీడ బ్ల్యూసీ పనితీరు మెరుగుపర్చడం, ప్రాజెక్టులకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించడం, కేంద్ర జలవనరుల శాఖ సామర్థ్యం పెంపొందించడం సహా పలు అంశాలైపై ఒక రోడ్డు మ్యాప్ సిద్ధం చేయడం సమన్వయ కమిటీ లక్ష్యం. ప్రాజెక్టుల పనులు వేగంగా చేపట్టడంతోపాటు, నాణ్యతను నిత్యం పర్యవేక్షించడం వంటి అంశాల్లో ఈ కమిటీ కేంద్రానికి పలు సూచనలు చేయబోతుంది. నెల రోజుల్లో నివేదిక సిద్ధం చేయనుంది. ఈ సమావేశానికి సమన్వయ కమిటీ సభ్యుని హోదాలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు.
ప్రాజెక్టుల అనుమతులకు ప్రస్తుతం ఉన్న విధానాలను మార్చాలని గత జలమంథన్ సమావేశంలో హరీశ్‌రావు చేసిన ప్రతిపాదన పట్ల కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి వెంటనే స్పందించారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుమతుల కోసం కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోందని, అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి నివేదిక పంపితే రెండేళ్ల కాలం పడుతోందని, దీంతో అవి సకాలంలో పూర్తి కావడంలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగి, విలువైన ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు.
హరీశ్ సూచనలతో ఏకీభవించిన కేంద్ర మంత్రి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖ మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఈ సమన్వయ కమిటీ ఏర్పాటైంది. హరీశ్ రావు, మహారాష్ట్ర మంత్రి గిరిష్ దత్తాత్రేయ మహాజన్ సభ్యులుగా ఉన్నారు. రాజస్తాన్, జమ్ము కశ్మీర్, అస్సాం, ఏపీ రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు.