► ఇప్పటివరకు కేంద్రం నుంచి 75-90 శాతం నిధులు
► ఇకపై ఇచ్చేది 60 శాతమే
► రెట్టింపైన విద్యాశాఖ ప్రణాళిక బడ్జెట్
► మొత్తంగా రూ.14,124 కోట్లు కావాలని ప్రతిపాదనలు!
► మోడల్ స్కూళ్ల భారం పూర్తిగా రాష్ట్రంపైనే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పథకాల భారం ఈసారి రాష్ట్రంపై భారీగా పెరగనుంది. దీంతో పాఠశాల విద్యాశాఖకు ప్రణాళిక బడ్జెట్ కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటివరకు కొన్ని పథకాల్లో 90 శాతం నిధులను ఇస్తుండగా.. మరికొన్నింటికి 75 శాతం నిధులను ఇస్తోంది. కానీ ఇకపై కేంద్రం 60 శాతం నిధులే ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆర్థిక శాఖకు పంపేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తంగా పాఠశాల విద్యకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,124 కోట్లు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇందులో ప్రణాళిక బడ్జెట్ కింద రెట్టింపు నిధులు అవసరమని ప్రతిపాదించింది. గతేడాది ప్రణాళిక బడ్జెట్ కింద రూ.1,854 కోట్లు ప్రతిపాదించిన విద్యాశాఖ ఈసారి రూ.3,591 కోట్లు కావాలని పేర్కొంది. మరోవైపు వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయం కింద కేటాయించే నాన్ ప్లాన్ బడ్జెట్ గత ఏడాది రూ.9,111 కోట్లు ఉండగా ఈసారి రూ.10,533 కోట్లు అవసరమని పేర్కొంది. పదో పీఆర్‌సీ కింద పెరిగిన వేతనాలు, డీఏ తదితర ఖర్చులు పెరగడంతో నాన్ ప్లాన్ బడ్జెట్ కింద ఎక్కువ కేటాయింపు అవసరమని పేర్కొంది.
రాష్ట్రంపై తప్పని భారం: మోడల్ స్కూళ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో ఇప్పటివరకు ప్రారంభించిన స్కూళ్లు, వాటి నిర్వహణ వేల మంది టీచర్ల జీతభత్యాలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. మరోవైపు సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర పథకాలకు కేంద్ర ప్రభుత్వం తమ వాటాను తగ్గించడంతో గత ఏడాది కంటే ఈసారి అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వీటికి తోడు గురుకుల విద్యాలయాలకు అదనంగా భవన నిర్మాణాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి పనులకు అదనపు నిధులు కావాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు కేజీ టు పీజీ కింద టోకెన్ అమౌంట్‌గా రూ.75 కోట్లు ప్రతిపాదించినా ప్రభుత్వం ఈసారి దీనికి ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పాఠశాల విద్య ప్రతిపాదించిన బడ్జెట్ ఇదీ..(రూ.కోట్లలో)
మొత్తం బడ్జెట్ 14,124
ప్రణాళిక 3,591
నాన్ ప్లాన్ 10,533
ఇందులో దేనికెంత..?
కేంద్ర రాష్ట్ర భాగస్వామ్య పథకాలకు 2,177
కిచెన్ షెడ్లకు 162
కేజీ టు పీజీ టోకెన్ అమౌంట్ 75
గత ఏడాది ఇలా..(రూ.కోట్లలో)
మొత్తం బడ్జెట్ 10,965
ప్రణాళిక పద్దు 1,854
ప్రణాళికేతర పద్దు 9,111
కేంద్ర పథకాలు తడిసి మోపెడు!
Published Mon, Jan 4 2016 1:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement