
హైదరాబాద్: సారు.. కారు.. పదహారు.. మన మద్దతున్న వారిది ఢిల్లీలో సర్కారు అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి మద్దతుగా కంటోన్మెంట్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 మంది ఎంపీలు గెలిస్తే మన మద్దతున్న ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని, తద్వారా కంటోన్మెంట్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. జీహెచ్‌ఎంసీతో పోలిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి వెనుకబడి పోయిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్యాట్నీ–హకీంపేట, ప్యారడైజ్–సుచిత్రా మార్గాల్లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
గత ఐదేళ్లలో తెలంగాణలో టీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పాలంటే గంట పాటు ధారాళంగా చెబుతామని, మోదీ ప్రభుత్వం మాత్రం తామేం చేశామో చెప్పుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. స్థానికుడిగా కంటోన్మెంట్ సమస్యలపై తన కు సంపూర్ణ అవగాహన ఉందని, ఎంపీగా గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సభ్యులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తానని రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌కు కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేవని, వార్ వన్‌సైడ్‌గా కొనసాగుతోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment