ప్రజలకు మరింత చేరువవుతాం...
- సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- కమిషనర్‌గా ఏడాది పూర్తి
సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన సేవలందించేందుకు తాము ప్రజలకు మరింత చేరువవుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 4వ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి ఈనెల 27కు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆనంద్ గురువారం గతేడాది తాము సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ ప్రణాళికను మీడియాకు వివరించారు.
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన అభయ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకుని, పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి దోషులకు శిక్షపడేలా చేయడంలో సఫలమయ్యామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐటీ కారిడార్ పోలిసింగ్‌ను డీజీపీ ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించామని, ఇందు కోసం ప్రత్యేకంగా ఐదు పెట్రోలింగ్ వాహనాలను, 40 మంది సిబ్బందిని, వీరిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ఇన్‌స్పెక్టర్‌ను నియమించామన్నారు.
ఇక ఐటీ ఉద్యోగినిల భద్రత కోసం రవాణా వ్యవస్థను మెరుగపర్చడంతో పాటు ప్రతి క్యాబ్‌కు పోలీసు రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పని సరి చేశామన్నారు. దీనికి తోడు మహిళా ఇన్‌స్పెక్టర్ నేతత్వంలో మహిళా హెల్స్‌లైన్‌ను ఏర్పాటు చేసి.. ఐటీ ఉద్యోగినుల్లో ఆత్మస్థైర్యం పెంచామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయన్నారు. సైబరాబాద్‌లో సుమారు 250 ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో గతంలో 80 కంపెనీలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉండగా... ఈ ఏడాది 150 కంపెనీలను చేర్చామన్నారు.
భవిష్యత్తులో అన్ని కంపెనీలను ఇం దులో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు కృషి చేశామన్నారు. ఇక ఈనెలలో సిక్‌చావ్నీలో జరిగిన మతఘర్షణలు వేరే ప్రాంతాలకు విస్తరించకుండా తమ సిబ్బం ది, అధికారులు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.
ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి...
నగర ట్రాఫిక్ చీఫ్‌గా తనకు ఉన్న గతానుభవంతో సైబరాబాద్‌లో సైతం ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతితో కలిసి ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు ఫలించాయన్నారు. రద్దీ జంక్షన్లను మోడ్రన్ జంక్షన్లుగా చేసి పాదచారులు సులువుగా రోడ్డు దాటే అవకాశం కల్పించామన్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్డుపై 24 గంటలూ పోలీసు గస్తీని ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల భరతం పట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఉధృతం చేయడంతో పాటు దేశంలోనే మొదటిసారిగా ‘ఔటర్’పై లేన ్లవారీ వేగ నియంత్రణ అమలు చేయడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు.
సిక్‌చావ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం...
సిక్‌చావ్నీలో ఎన్నో ఏళ్లుగా రగులుతున్న మత విద్వేషాలకు చెక్ పెట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇరు మత పెద్దలతో ఇప్పటికే సమావేశమై ఈ విషయంపై చర్చించామన్నారు. ఒక వర్గానికి చెందిన జెండా విషయంలో తరచు గొడవలు జరగడం మంచిది కాదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయపార్టీల నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరువర్గాల మతపెద్దలతో త్వరలో భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఆనంద్ వెల్లడించారు.