కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడతో ముందుకు పోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లాలోని ప్రాజెక్టు ముంపు గ్రామమైన కొండపాక మండలం ఎర్రవల్లిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుపై స్థానికుల ఆమోదం పొందకుండానే నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను తప్పుపడుతూ రాద్దాంతం చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు మాట్లాడటం శోచనీయమన్నారు. నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.