శివ..ఖతర్నాక్ | Chain robberies target women | Sakshi
Sakshi News home page

శివ..ఖతర్నాక్

Published Sun, Aug 17 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

శివ..ఖతర్నాక్

శివ..ఖతర్నాక్

  • మహిళలే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలు        
  •  300 నేరాల్లో నిందితుడు   
  •  సంపన్న జీవితం       
  •  పోలీస్ కాల్పుల్లో మృతితో కలకలం
  •  ఉలిక్కిపడ్డ నార్సింగివాసులు
  • మణికొండ/గచ్చిబౌలి: అతని పేరు శివ. చూడబోతే టిప్‌టాప్.. నార్సింగిలోని విశాల భవనం ఆవరణలో ఖరీదైన రెండు కార్లు.. ద్విచక్ర వాహనాలు.. ఇంట్లో విలువైన ఫర్నిచర్. తరచూ ఫారిన్ ట్రిప్‌లతో షికార్లు.. ఇంతటి దర్జా, దర్పం వెలగబెట్టే అతను నెలకు లక్షలార్జించే ఉన్నతోద్యోగి కాదు సుమా.. పేరుమోసిన, కరడుగట్టిన చైన్‌స్నాచర్. ఒకటీ రెండూ  కాదు ఏకంగా 300 నేరాల్లో నిందితుడు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ సమీపంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇతను మరణించిన విషయం తెలిసిందే.
     
    ఉలిక్కిపడ్డ నార్సింగివాసులు..

    చైన్‌స్నాచర్ కె.శివకుమార్ నివాసం నార్సింగి అని తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏకంగా ఠాణాకు 50 మీటర్ల దూరంలోనే నివాసం ఉండడం స్థానికులను నివ్వెరపరచింది. శనివారం ఉదయం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శంషాబాద్‌లోని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతుడి ఇంటిని సందర్శించారు. ఆయనతోపాటు మీడియా హడావిడి కన్పించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు     కంగుతిన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ.. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ మాదిరిగా సాఫ్ట్‌గా కన్పించే ఈ వ్యక్తి చైన్ స్నాచర్ అని తెలియడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది.
     
    చేసేది చైన్‌స్నాచింగ్...

    నెల్లూరు జిల్లాకు చెందిన కె.శివ కుమార్ చేసేది చైన్‌స్నాచింగ్. పోలీసు చరిత్రలో ఎక్కడా ఇప్పటివరకు ఇలాంటి కేసు వెలుగు చూడలేదనే చెప్పాలి. అతనికి రెండు కార్లతోపాటు భార్యకు ఓ స్కూటీ,  పిల్లలకు సైకిళ్లు, ఎల్‌ఈడీ టీవీ, ఖరీదైన సోఫాలు, బెడ్‌రూమ్‌లో ఏసీ, బాతింగ్ టబ్, అక్వేరియం తదితర వస్తువులన్నీ చూసి పోలీసులే నివ్వెరపోయారు. భార్యాపిల్లలతో ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లోను దిగిన ఫొటోలు సైతం లభించాయి. అతని ఇద్దరి పిల్లలను స్థానికంగా ఉన్న వెస్ట్‌సైడ్ పాఠశాలలో చదివిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. శివ 18 రోజుల క్రితమే నెలకు రూ.8,500 అద్దె చెల్లించేందుకు అంగీకరించి ఈ ఇంట్లో చేరాడని స్థానికులు చెబుతున్నారు.
     
    నేరం తీరు ఇలా...
     
    ఇంటి ముందు ముగ్గులు వేసే వారు, గుడికి వెళ్లే మహిళలు, స్కూల్ పిల్లలకు టిఫిన్ తీసుకెళ్లే తల్లులను శివ టార్గెట్ చేసేవాడు. తన బైక్‌పై ఒక్కడే వచ్చి స్నాచింగ్ చేసి పారిపోయేవాడు. మరో దొంగ జగదీష్‌తో కలిసి స్నాచింగ్ చేసేటప్పుడు శివ నడుచుకుంటూ వెళ్లి మహిళ మెడలో గొలుసు తెంపుకుని పరుగెత్తుకుంటూ వచ్చి అప్పటికే బైక్‌పై సిద్ధంగా ఉన్న జగదీష్‌తో పారిపోయేవాడు. ఇక జగదీష్, రాజ్‌కుమార్, శివలు ముగ్గురు వేటకు వెళ్లేటప్పుడు మాత్రం కారును ఉపయోగించేవారు. చిరునామా అడిగినట్టే అడిగి స్నాచింగ్‌కు పాల్పడి కారులో పారిపోయేవారు. గత నెలలో అల్వాల్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులపై కూడా దాడి చేసి స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
     
    ఎక్కడైనా పది రోజులే...
     
    శివ చాలా తెలివిగా వ్యవహరించే వాడు. ఏ ఇంట్లోనూ 10-15 రోజులకు మించి ఉం డడు. ఈ విధంగా పోలీసుల దృష్టిని మరల్చేవాడు. నార్సింగిలోని ఇంటిలోకి కూడా ఇటీవలే అద్దెకు దిగాడు. ఇంటి సామగ్రిని లారీలో తీసుకెళ్తే పట్టుబడతామని భావించేవాడు. ఇల్లు ఖాళీ చేసే సమయంలో సామగ్రిని అక్కడే వదిలేసి వెళ్లేవాడు. సెల్ నెంబర్లను కూడా వారానికోసారి మార్చేవాడు.
     
    సంబరాలు చేసుకున్న మహిళలు..
     
    పోలీసు కాల్పుల్లో గొలుసు దొంగ శివ మరణించాడనే విషయం తెలియగానే నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు సంబరాలు చేసుకున్నారు. మియాపూర్, మాదాపూర్, కేపీహెచ్‌బీ కాలనీలో మహిళలు స్వీట్లు పంచుకుని, బాణ సంచా కాల్చారు.
     
    పత్తాలేని 50 మంది స్నాచర్లు...
     
    స్నాచర్ శివ చనిపోయినట్టు మీడియాలో రావడంతో సైబరాబాద్, హైదరాబాద్‌లోని సుమారు 50 మంది కరుడుగట్టిన స్నాచర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. స్నాచర్ల కోసం సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండడంతో అనుమానించిన పాత నేరస్తులు ఇతర జిల్లాల్లో షెల్టర్  జోన్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. సైబరాబాద్‌లో అఖీలుద్దీన్, హుస్సేన్ లాంబ, వాసిమ్, ముఖేష్‌కుమార్, దస్తగిర్, సయ్యద్ హాజీ, హబీబ్ మోహసిన్, రెనాల్డ్, ప్రసాద్, రాజశేఖర్, అంబాదాస్ పటేల్, షేక్ సుల్తాన్, జుబీర్ బిన్ సలామ్, గడ్డం శ్రీకాంత్, లయీక్ హుస్సేన్, అబ్దుల్ షేక్, చంద్రశేఖర్‌రెడ్డి, సురేందర్, రేవంత్ లోకేష్, సోహల్ సిద్దిక్, సయ్యద్ అస్లమ్, ఎండీ ఉమర్, అబ్రార్, పండపాటి జగదీష్‌లు పరారీలో ఉన్నట్టు సమాచారం.
     
    ఇన్‌స్పెక్టర్‌ను పరామర్శించిన..
     
    శివ కత్తితో దాడి చేయడంతో ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్‌లు గాయపడ్డారు. వీరు గచ్చిబౌలిలోని హిమగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సైబరాబాద్ కమిషనర్ ఆనంద్, క్రైమ్స్ ఇన్‌చార్జి డీసీపీ జానకి షర్మిల, డీసీపీ క్రాంతిరాణా టాటా, ఏసీపీ శ్రీధర్,  ఇన్‌స్పెక్టర్ రమేశ్‌కుమార్ వీరిని పరామర్శించారు. ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. శివ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోవడంతో మరణించాడని ఉస్మానియా మార్చురీ వైద్యులు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement