బీసీలంటే బిజినెస్ క్లాస్ అనుకున్నట్టుంది!
- చంద్రబాబు తీరుపై వైఎస్సార్‌సీపీ నేత కృష్ణదాస్ విమర్శ
- బీసీలను కాదని సుజనాకి పదవా?
- ఆరోపణలున్న వ్యక్తిని కేంద్ర మంత్రిని చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బీసీలంటే ‘బిజినెస్ క్లాస్’ (వ్యాపార తరగతి) అని సీఎం చంద్రబాబు భావించినట్లుగా ఉందని.. అందుకే వెనుకబడిన తరగతుల వారిని కాదని తన వ్యాపారవర్గానికి చెందిన సుజనా చౌదరికి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించారని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఎన్నికలకు ముందు బీసీ జపం చేసిన బాబు అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించి ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పి వారి మద్దతు పొందే ప్రయత్నం చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక.. మంత్రివర్గ విస్తరణల్లో ఆ వర్గాల వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్డీయే తొలి విడత మంత్రివర్గంలో అశోక్‌గజపతిరాజుకు, ఆదివారం జరిగిన విస్తరణలో వ్యాపారవేత్త సుజనా చౌదరికి టీడీపీ తరఫున అవకాశం కల్పించి బీసీలను నిర్లక్ష్యం చేశారన్నారు. ‘‘సుజనా చౌదరిపై అనేక ఆరోపణలున్నాయి.
టీడీపీకి అనుకూలంగా ఉండే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలోనే చౌదరి పాల్పడిన అక్రమాలపై ఎన్నో వార్తలు వచ్చాయి. 12.03.2009న ‘సుజనా’త్మక మాయాబజార్’, 13.03.2009న ‘పన్ను ఎగవేత కుదిరింది’, 15.03.2009న ‘ఛత్రం కోసం చక్రం-రాజకీయ బేహారి సుజనా చౌదరి’, 01.09.2009న ‘సుజనాత్మక మాయాబజార్ నిజమే’ ...అనే శీర్షికలతో ఆ పత్రికలో వార్తలు వెలువడ్డాయి.
ఇలాంటి ఆరోపణలున్న వ్యక్తిని కేంద్రంలో మంత్రిని చేస్తారా?’’ అని కృష్ణదాస్ ప్రశ్నించారు. (ఆయా వార్తల క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తూ..) దీనిని బట్టి బీసీలను పావులుగా వాడుకుంటున్న సీఎంకు వారిపై ఉన్నది కపట ప్రేమే నని స్పష్టం అవుతోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు గెలిచే స్థానాల్లో సీట్లు ఇవ్వకుండా ఆ వర్గానికి అన్యాయం చేశారని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం బాబు ఏ మాత్రం కృషి చేయడం లేదని దుయ్యబట్టారు.
బీసీలకు మేలు జరిగింది దివంగత నేత వైఎస్ హయాంలోనేనని, ఆయన పాలనలో ప్రవేశపెట్టిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది బీసీలేనని కృష్ణదాస్ గుర్తు చేశారు. ఎప్పటికైనా బీసీలకు మేలు చేసేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. బాబు ఇప్పటికైనా బీసీలకు ప్రాధాన్యమివ్వాలని తమ పార్టీ తరఫున కోరుతున్నామని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.