
చంద్రబాబు తదుపరి పర్యటన ఖమ్మంలో?
టీడీపీ ఉనికి కాపాడేందుకు నెలకో జిల్లా పర్యటన సాగిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఉనికి కాపాడేందుకు నెలకో జిల్లా పర్యటన సాగిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మే నెలలో ఖమ్మం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాల్లో పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పేరుతో ఫిబ్రవరి నుంచి చంద్రబాబు తెలంగాణలో నెలకో జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత వరంగల్, ఆ తర్వాత కరీంనగర్, ఈనెల 23న మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మే నెలలో కూడా రాష్ట్రంలో సభ నిర్వహించాలని బాబు పార్టీ నేతలను ఆదేశించగా, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలను పరిశీలించారు. మూడు జిల్లాల్లో పార్టీ తీవ్రంగా బలహీనపడినప్పటికీ, ఖమ్మం జిల్లానే కొంత నయమనే యోచనలో ఉన్నారు. ఖమ్మంలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి కావడంతో ఆ జిల్లాకు చెందిన 80 శాతం పార్టీ నేతలు ఆయన వెంట నడిచారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉండడమే గాక, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ప్రభావం, ఒక సామాజిక వర్గం ఇంకా టీడీపీ వైపే ఉందని నమ్ముతుండడంతో చంద్రబాబు కూడా ఖమ్మంవైపే మొగ్గుచూపినట్లు సమాచారం.
మే నెలాఖరున మహానాడు సభ ఉండటంతో అంతకన్నా ముందే ఖమ్మంలో చంద్రబాబుతో బహిరంగ సభను ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర పార్టీ ముఖ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ బలహీనపడిందన్న ప్రచారానికి తెరదించేందుకైనా భారీ స్థాయిలో సభ నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జూన్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ స్థాయిలో టీడీపీ సభను కూడా జరపాలనే ఆలోచన పార్టీలో ఉంది.