
సమాజంలో మార్పు కోసం...
భువనగిరి టౌన్ : సమాజంలోని రుగ్మతలను, అవినీతిని, అన్యాయాలను వెండితెరపై చూపి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మెగాఫోన్ పట్టుకున్నా... భిన్న సంస్కృతుల సమ్మేళనమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొత్తకోణంలో ప్రపంచానికి చూపుతానని పేర్కొంటున్నాడు వర్ధమాన దర్శకుడు నల్ల అక్షయ్ కృష్ణ. ద్రాందత్త్ క్రియేషన్స్ ప్రొడక్షన్-2 ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో జరుగుతున్న సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మరిన్ని వివరాలు
ఆయన మాటల్లోనే..
మీ నేపథ్యం..
నా పేరు నల్ల అక్షయ్ కృష్ణ. మా స్వస్థలం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం గూడూరు.
సినీరంగ ప్రవేశం..
సినిమా దర్శకుడిని కావాలని గతంలో శివతేజ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసాను. 14 సంవత్సరాల పాటు హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ దర్శకత్వం ఛాన్స్ కోసం ప్రయత్నించా. ఆటో నడుపుతున్న సందర్భంలో కడప జిల్లా కమలాపురంకు చెందిన సాయినాథ్‌శర్మతో పరిచయం ఏర్పడింది. నా ప్రతిభను గుర్తించి సినిమా తీసేందుకు అవకాశం కల్పించాడు.
డెరైక్ట్ చేసిన సినిమాలు..
నేను తొలి ప్రయత్నంగా దోమల నివారణకు కోసం ఒక యాడ్ చేశాను. అనంతరం మొదటి సారిగా ‘నా మనస్సులో...’ సినిమా తీశాను. ఇది వచ్చే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే వచ్చే నెల 25వ తేదీన ద్రాం దత్త్ క్రియేషన్స్ ఆధ్వర్యంలోనే మరో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నాం.
ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు
ప్రస్తుత సమాజంలో అవినీతి, బాలకార్మిక వ్యవస్థ, ప్రేమ పేరుతో మోసాలు అధికంగా జరుగుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సినిమాలో మహిళలు అసభ్యకరంగా చూపకుండా సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం.