
‘సంక్షేమం’లో మార్పులు చేర్పులు
రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం
నేడో, రేపో ముఖ్యమంత్రికి తుది నివేదిక
హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో అవసరమైన మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ శాఖల పథకాల అమలుకు ఒకేవిధమైన ఆదాయ, వయో పరిమితిని ప్రభుత్వం నిర్ణయించనుంది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల రాయితీ గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచే విషయంపై ప్రభుత్వం దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు 2015-16లో అమలు చేయాల్సిన సబ్సిడీ విధానం, బ్యాంక్ లింకేజీ. ఆయా పథకాల నిబంధనలు, ఇంకా తీసుకురావాల్సిన మార్పులపై కూడా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 8న ఆయా శాఖల అధికారులు తీసుకొచ్చిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల బృందం విస్తృతంగా చర్చించిన విషయం విదితమే.
వ్యక్తిగత రుణ విభాగం కింద గరిష్ట రుణ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడంతోపాటు రాయితీని రూ.5 లక్షలకు పెంచాలని అధికారులు ప్రతిపాదించగా మంత్రుల బృందం సానుకూలంగా స్పందించింది. ముఖ్యకార్యదర్శులు జె.రేమండ్‌పీటర్, టి.రాధా ఎస్సీ, బీసీ శాఖల అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించి, ఈ నెల 8న జరిగిన భేటీకి సంబంధించిన సమావేశ మినిట్స్‌కు తుదిరూపునిచ్చారు. గత సమావేశంలో ఆయా పథకాలకు సంబంధించి చేయాల్సిన మార్పులు, మార్గదర్శకాల్లో చేపట్టాల్సిన సవరణలు, ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన వచ్చిన సూచనలతో ఉన్నతాధికారులు తుది అంచనాను రూపొందించారు. వీటిని ఒకట్రెండు రోజుల్లోనే సీఎంకు సమర్పిస్తారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా సీఎం ఏవైనా ఆదేశాలిస్తే వాటికి అనుగుణంగా కొత్త రాయితీ విధానాన్ని ఖరారు కానుంది.
కళాశాల విద్యార్థులకు పాకెట్ మనీ
కాలేజీవిద్యార్థులకు నెలకు రూ.200 చొప్పున పాకెట్ మనీ ఇవ్వాలని, కాస్మోటిక్ చార్జీలను అమ్మాయిలకు నెలకు రూ.200, అబ్బాయిలకు రూ.150 ఇవ్వాలని ప్రతిపాదించారు. స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల యూనిట్ విలువ రూ.లక్ష అయితే 80 శాతం, రూ.2 లక్షలైతే 70 శాతం, రూ.3 లక్షలైతే 60 శాతం, రూ.4-5 లక్షలు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ పథకాలకు 50-55 ఏళ్ల వయో పరిమితి, గ్రామీణప్రాంతాల్లో ఆదా య పరిమితిని రూ. లక్షన్నరకు, పట్టణప్రాం తాల్లో రూ.2 లక్షలు పెంచాలని (ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకే ఈ పరిమితి ఉంది) సూచించారు.