అద్దంలా సిద్దిపేట
సీఎం కేసీఆర్ రాక నేడే
- ఏర్పాట్లు పూర్తి.. 3 గంటల పాటు టూర్
- మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం
సిద్దిపేట జోన్: సర్వాంగ సుందరంగా సిద్దిపేట ముస్తాబైంది. హరితహారంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటకు వస్తుండటంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి హరీశ్‌రావు రెండు రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి సుమారు 3 గంటల పాటు హరితహారంలో పాల్గొననున్నారు. పొన్నాల దాబా నుంచి బద్ధిపడగ వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమం కొనసాగనుంది.
సీఎం పర్యటన ప్రాంతాలను ఆర్డీఓ ముత్యం రెడ్డి, జిల్లాకు చెందిన డీఎస్పీల బృందం పరిశీలించింది. పట్టణంలో నిర్దేశించిన పది జోన్ల పరిధిలో గుంతలు తీయడం, మొక్కలు సిద్ధంగా ఉంచడం, ట్రీగార్డుల పంపిణీ, డివైడర్లకు తుదిమెరుగులు దిద్దడం, పలు చోట్ల రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు, మురికి కాలువల శుభ్రం తదితర పనులను చేపట్టారు. మరో వైపు తమ పార్టీ అగ్రనేత రెండో సారి ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేటకు రానుండటంతో పార్టీ నేతలు ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో సిద్దిపేటకు కొత్త శోభను తెచ్చిపెట్టారు. ఇదిలా ఉండగా రాత్రి ఎస్పీ సుమతి బందోబస్తును పర్యవేక్షించారు.