కబ్జానుబట్టి క్రమబద్ధీకరణ | Chief KCR proposals for an all-party meeting | Sakshi
Sakshi News home page

కబ్జానుబట్టి క్రమబద్ధీకరణ

Published Wed, Dec 17 2014 4:26 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

కబ్జానుబట్టి క్రమబద్ధీకరణ - Sakshi

కబ్జానుబట్టి క్రమబద్ధీకరణ

అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు
హైదరాబాద్‌లో భూముల క్రమబద్ధీకరణకు ఆరు మార్గాలు
125 గజాలలోపు నివాసాలకు ఉచిత క్రమబద్ధీకరణ
250-300 గజాల్లో నివాసాలకు స్వల్ప రుసుం వసూలు
500 గజాలు దాటితే భారీ రుసం వసూలు
కబ్జాకు గురైన ఖాళీ స్థలాల స్వాధీనం
ఇకపై నగరంలో భూమి ఆక్రమించాలంటే దడ పుట్టాలి
కబ్జాల నివారణకు కఠిన చట్టాలు తీసుకొస్తాం

 
 హైదరాబాద్: భూకబ్జాల తీరును బట్టి క్రమబద్ధీకరణ విధానం ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో భూ ఆక్రమణలు నాలుగు రకాలుగా జరిగాయని ఆయన పేర్కొన్నారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారని, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ భూమి అని తెలియకుండా దళారుల వద్ద కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారన్నారు. మరికొన్ని భూములను పాఠశాలలు, వైద్యశాలలు, ప్రార్థనా మందిరాల కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక కబ్జాదారులు యథేచ్ఛగా భూములు ఆక్రమించారని, వాటిల్లో కొన్నిచోట్ల నిర్మాణాలు వెలిశాయని, మరికొన్ని ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి క్రమబద్ధీకరణకు ఒకే విధానం అనుసరించలేమని తెలిపారు.

హైదరాబాద్ నగరానికి సంబంధించిన అంశాలపై పార్టీల అభిప్రాయాలు స్వీకరించేందుకు మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతోపాటు మల్లు భట్టి విక్రమార్క, నిరంజన్(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, నర్సిరెడ్డి(టీడీపీ), కిషన్‌రెడ్డి, లక్ష్మణ్(బీజేపీ), జాఫ్రీ(ఎంఐఎం), చాడ వెంకట్ రెడ్డి, రవీంద్రకుమార్(సీపీఐ), తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య(సీపీఎం), వేణుగోపాలచారి, రాజేశ్వర్ రెడ్డి(టీఆర్‌ఎస్), శివకుమార్(వైఎస్సార్‌సీపీ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అఖిలపక్ష నేతల ముందు ప్రభుత్వం తర పున ఆరు ప్రతిపాదనలు ఉంచగా.. వాటిని అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాయి.

 ఆ ప్రతిపాదనలివీ..
 
1. 125 గజాలలోపు స్థలంలో
 పేదల నివాసాలకు ఉచిత క్రమబద్ధీకరణ
 2. 250-300 గజాల స్థలంలో నివాసం ఉంటున్న మధ్య తరగతి ప్రజల విషయంలో కూడా ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుంది. స్వల్ప రుసుం తీసుకుని వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తుంది.
 3. 500 గజాలలోపు స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారి భూములను ప్రతి 100 గజాలకు కొంత ధరను పెంచుతూ క్రమబద్ధీకరిస్తుంది.
 4. 500 గజాలకుపైగా భూమిని ఆక్రమించి నివాసాలు, శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారి నుంచి భారీ మొత్తంలో రుసుం రాబట్టి క్రమబద్ధీకరిస్తుంది.
 5. కబ్జాకు గురైన ఖాళీ స్థలాలను మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
 6. 15 నుంచి 50 గజాలలోపు స్థలంలో నివాసముంటున్న వారందరినీ ఒక సమూహం కిందికి చేర్చి, వారికి ప్రభుత్వమే బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తుంది.

ఎమ్మెల్యేలతో నియోజకవర్గ కమిటీలు..

 ప్రభుత్వం పేర్కొన్న ఆరు ప్రతిపాదనల్లో ఎవరెవరు ఏ కేటగిరీ కిందకు వస్తారో నిర్ణయించడానికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పేదలకు నిలువ నీడ కల్పించే విషయంలో అత్యంత ఉదారంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం రాజకీయ పట్టింపులకు పోకుండా అందరిని పరిగణలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పార్టీ ఏదైనా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పర్యవేక్షణ, సహకారంతోనే భూకబ్జాలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు. భూకబ్జాలను క్రమబద్ధీకరించి నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ఆ డబ్బుతోనే ప్రభుత్వం నడవదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, భూవివాదాలకు శాశ్వత ముగింపు పలకడం కోసమే భూముల క్రమబద్ధీకరణ చేపట్టామన్నారు.
 
కబ్జాలపై కఠిన చట్టాలు
 
హైదరాబాద్‌లో భూముల ధరలు పెరుగుతున్న కొద్దీ కబ్జాలు పెరిగాయని, కబ్జారాయుళ్లకు నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అత్యంత సులువుగా మారిందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సాధారణ పౌరులు నగరంలో భూములు కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమించాలంటే ఎవరికైనా దడ పుట్టే పరిస్థితి రావాలని, అందుకు కఠిన చట్టాలు తెచ్చే యోచనలో ఉన్నామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మెట్రో రైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులు బీఆర్ మీనా, రేమండ్ పీటర్, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహదారు బీవీ పాపారావు పాల్గొన్నారు.
 
 ఉన్న స్థలంలోనే ఇల్లు కట్టించాలి
 భట్టి విక్రమార్క, కాంగ్రెస్
 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన నిర్ణయం మేరకు 125 గజాల్లోపు స్థలాలను పేదలకు ఇచ్చి, ఆ స్థలాల్లోనే ఇళ్లు కట్టించాలని ప్రభుత్వానికి సూచించాం. తెలిసీతెలియక (500 గజాల్లోపు) ఆక్రమిత భూములను కొనుక్కున్న మధ్య తరగతి వారి విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేయాలని కోరాం. ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు కట్టిన వారి నుంచి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పాం. చారిత్రక కట్టడాలకు ముప్పు లేనందున, మెట్రోరైల్ అలైన్‌మెంట్ మార్పునకు మా పార్టీ అంగీకరించడం లేదు.
 
ధారాదత్తం చేయొద్దు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ

 పేద వర్గాల వారు ఇల్లు కట్టుకొని ఉంటుంటే మినహా, ధనిక వర్గాలకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయొద్దని ప్రభుత్వానికి విన్నవించాం. 500 గజాలకు పైగా ఆక్రమించుకున్న వారి నుంచి భూములను స్వాధీనం చేసుకొని పరిశ్రమల స్థాపనకు వినియోగించుకోవాలని సూచించాం. భూములపై ఉన్న కోర్టు కేసులను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించాం.
 
అర్హులు 270 మందేనా జాఫ్రీ, ఎంఐఎం

అర్బన్ ల్యాండ్ సీలింగ్‌కు సంబంధించిన సమాచారం మినహా, గత సమావేశంలో అడిగిన వాటిలో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 200 గజాల్లోపు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారిలో 270 మందే అర్హులని అధికారులు చెబుతున్నారు. 200 గజాలకు పైగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం 41 వేల దరఖాస్తులు వచ్చాయంటున్నారు. వక్ఫ్ భూములకు సంబంధించి అధికారులు చూపుతున్న లెక్కలకు, వాస్తవానికి ఎంతో వ్యత్యాసం ఉంది.
 
జూన్ 2 కటాఫ్‌గా పరిగణించాలి శివకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2వ తేదీని కటాప్ డేట్‌గా పరిగణించి, పేదలు నివాసముం టున్న 125 గజాల్లోపు స్థలాలను క్రమబద్ధీకరించాలని సూచిం చాం. 13 అంశాలతో కూడిన లేఖను సీఎం కు అందించాం. 90 శాతం అంశాలపై ఆయ న సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసుల పరిష్కారం కోసం సీసీఎల్‌ఏ స్థాయిలో పర్యవేక్షించాలని చెప్పాం. బడీచౌడీలోని వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మెట్రోరైల్‌కు అలైన్‌మెంట్ మార్పునకు సూచనలు చేశాం.
 
ప్రజలు భ యపడుతున్నారు  చాడ వెంకటరెడ్డి, సీపీఐ
 
పేదలనివాస స్థలాలను ప్రభుత్వం గుంజుకోవాలని యత్నిస్తోంది. ప్రభుత్వ చర్యలతో బుద్ధభవన్ వెనుక, భోలక్‌పూర్ ల్లో నివాసముంటున్న పేదలు భయభ్రాం తులకు గురవుతున్నారు. శేరిలింగంపల్లిలో 50 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్పినా సీఎం స్పందించడం లేదు. 125 గజాలపైన ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ఎలాంటి స్పష్టత రాలేదు.
 
చట్టం తేవాలని కోరాం  తమ్మినేని వీరభద్రం, సీపీఎం

భూముల క్రమబ ద్ధీకరణకు ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించాం. కోఠి ఈఎన్‌టీ స్థలం క్రమబ ద్ధీకరణ జీవో ను ఉపసంహరించుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం. ప్రస్తుత పరిస్థితులు చక్కబెట్టాక, కొత్త ఆక్రమణల గురించి చట్టం తెస్తామని సీఎం చెప్పారు. ఇంతకం టే ఆత్మవంచన మరోటి ఉండదు.  70% పేదల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.. పెద్దలవైతే అంగీకరిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement