ఓయూ ఉత్సవాలపై అఖిలపక్షం | An all-party meeting on Osmania University festivals | Sakshi
Sakshi News home page

ఓయూ ఉత్సవాలపై అఖిలపక్షం

Published Thu, Jan 26 2017 3:19 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

ఓయూ ఉత్సవాలపై అఖిలపక్షం - Sakshi

ఓయూ ఉత్సవాలపై అఖిలపక్షం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల నిర్వహణ తీరుతెన్నులపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఓయూ సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, క్లాస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఓయూ శతాబ్ది ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించబోతున్నది.. దాని నిర్వచనం ఏమిటో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉత్సవాలను బ్రహ్మాండంగా, అద్భుతంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోందని విమర్శించారు. తెలంగాణ వచ్చాక కూడా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలంటే భవనాలకు దీపాల అలంకరణ, ఫ్లడ్‌లైట్లు పెట్టడమేనా అని ప్రశ్నించారు.

ఎందరో ప్రముఖులను అందించిన ఘనత..
వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఓయూ దేశానికే తలమానికం వంటిదని.. ప్రధాని, సీఎంలు, వివిధరంగాలకు సంబంధించి ఎందరో ప్రముఖులను దేశానికి అందించిన ఘనత వర్సిటీకి ఉందని చెప్పారు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు, మలిదశ ఉద్యమానికి కీలకపాత్ర పోషించిన ఓయూ.. ప్రస్తుతం దీనస్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఓయూలోని పలు విభాగాలకు ప్రొఫెసర్లు లేని పరిస్థితి ఉందని, హాస్టల్‌ విద్యార్థులకు కనీస వసతులు లేక బహిర్భూమికి, ఆరుబయటే స్నానాలు చేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఓయూకు నాక్‌ గుర్తింపు కూడా రద్దు కావడం దురదృష్టకరమైన పరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకుని విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేస్తూ ప్రైవేట్‌ వర్సిటీలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement