మునుగోడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రవేశ పెట్టిన జవహర్ బాల ఆరోగ్య పథకం అటకెక్కింది. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచి నెల రోజులుదాటినా ఇంతవరకు కనీసం బాల ఆరోగ్య రక్ష కార్డులు ఇవ్వలేదు.జిలాల్లో మొత్తం 3781 పాఠశాలలు ఉండగా అందులో 2861 ప్రాథమిక, 310 ప్రాథమికోన్నత, 610 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో 4 లక్షల 14 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందించాలని గత ప్రభుత్వాలు బాల ఆరోగ్యరక్ష కార్డులు అందించేవి. ఆ కార్డులు కలిగిన వారికి ప్రతి మూడు నెలలకు ఒక రోజు పాఠశాలకు వెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని డాక్టర్ పరీక్షలు జరిపి అవసరమైనవారికి చికిత్సలు నిర్వహించేవారు. చిన్నచిన్న వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీచేసేవారు. అలాగే విద్యార్థి ఎత్తు, బరువుల తదితర వివరాలను కార్డులో పొందుపర్చేవారు. ఎవరికైనా శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటే వారిని పెద్ద ఆసుపత్రులకు పంపించేవారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం విద్యార్థులకు కనీసం కార్డులు కూడా అందించలేదు.
అనారోగ్యాల బారిన పేద విద్యార్థులు..
ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా పేద కుటుంబాలకు చెందిన వారు విద్యను అభ్యసిస్తున్నారు. వీరి తల్లితండ్రులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ కుటుంబ పోషణ కోసం శ్రమిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని చూసుకోని పరిస్థితి నెలకొని ఉంటుంది. వారితో పాటు, వారి పిల్లలకు చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే వైద్యుల వద్దకు వెళ్లి చూయించుకునే స్థోమత లేక అలాగే ఉండిపోతారు. దీంతో కొందరు చిన్నారులు పెద్ద పెద్ద అనారోగ్యాలబారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అవసరమైన బాల ఆరోగ్యరక్ష కార్డులతో పాటు వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు.
బాలల ఆరోగ్య పరిరక్షణేదీ
Published Thu, Jul 23 2015 11:09 PM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM
Advertisement
Advertisement