కేయూలో నెలకొన్న పరిస్థితుల పై తనకు అవగాహన ఉందని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని...
- ఇన్‌చార్జి వీసీ టి.చిరంజీవులు
- డిగ్రీ ‘స్పాట్ ’ త్వరలోనే కొనసాగింపు
కేయూ క్యాంపస్ : కేయూలో నెలకొన్న పరిస్థితుల పై తనకు అవగాహన ఉందని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఇన్‌చార్జి వీసీ, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు అన్నారు. ఇన్‌చార్జి వీసీ బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా గురువారం యూనివర్సిటీకి వచ్చారు. పరిపాలనా భవనంలోని సేనేట్ హాల్‌లో ప్రిన్సిపాల్స్, డీన్, విభాగాల అధిపతులు, పరిపాలనా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా వివిధ విభాగాల ప్రొఫెసర్లు పలు సమస్యలను ఆయన
దృష్టికి తెచ్చారు.
పీహెచ్‌డీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని, విద్యార్థుల మెస్ సమస్యను పరిష్కరించాలని, నిలిచిపోయిన డిగ్రీ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరారు. స్పందించిన చిరంజీవులు మాట్లాడుతూ యూనివర్సిటీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. పీహెచ్‌డీ అడ్మిషన్లను త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో సమయపాలన పాటించాలన్నారు.
బుధవారం లేదా గురువారం తప్పనిసరిగా తాను యూనివర్సిటీకి వస్తానని చెప్పారు. డిగ్రీ స్పాట్ వాల్యూయేషన్‌ను సోమవారంలోగా మళ్లీప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.భద్రునాయక్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ టి.శ్రీనివాసులు, యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీవీఎస్.శర్మ, ప్రొఫెసర్ వై.నర్సింహారెడ్డి, డాక్టర్ టి.సుమతి, ఉమామహేశ్వరి, డాక్టర్ ఎం.తిరుమలాదేవి, కెమిస్ట్రీ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ గాదె దయాకర్, ప్రొఫెసర్ పురుషోత్తం పాల్గొన్నారు. కాగా, పాఠశాలల ముగింపు చివరి రోజు చిరంజీవులు స్థానిక రేడియో స్టేషన్‌లో రేడియో టాక్ ద్వారా పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు.
స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి
కాశిబుగ్గ : విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని కేయూ ఇన్‌చార్జి వీసీ, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు అన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఓయాసిస్ ఉన్నత పాఠశాలలో పాఠశాల చైర్మన్ జేఎస్.పరంజ్యోతి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఐక్రోప్ సహకారంతో డిజిటల్ ‘ట్యాబ్-ల్యాబ్’ క్లాస్ రూంలను ఏర్పాటు చేశారు. దీనిని చిరంజీవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకమ్యునికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతపై వివరించారు. ప్రిన్సిపాల్ పరంజ్యోతి మాట్లాడుతూ డిజిటల్ ట్యాబ్ క్లాస్ రూం మొత్తం వైఫై సౌకర్యం కలిగి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో వడుప్సా ప్రతినిధులు భూపాల్‌రావు, నారాయణరెడ్డి, షణ్ముఖాచారి పాల్గొన్నారు.