జోరుగా నకిలీ నోట్ల చెలామణి | Circulation of counterfeit notes in district | Sakshi
Sakshi News home page

జోరుగా నకిలీ నోట్ల చెలామణి

Published Sat, Jun 21 2014 3:32 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

జోరుగా నకిలీ నోట్ల చెలామణి - Sakshi

జోరుగా నకిలీ నోట్ల చెలామణి

బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రాంతంలో నకిలీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నకిలీ నోట్లను వారికి అంటగడుతున్నారు. నిత్యకృత్యంగా ఈ దందా సాగుతున్నా పోలీసు యంత్రాంగం అరికట్టలేకపోతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
ఇలా సాగుతోంది...
బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వ్యాపారపరంగా బెల్లంపల్లి పురోగమిస్తోంది. ఇక్కడ అనేక వ్యాపారాలు జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు భారీ మొత్తంలో క్రయవిక్రయాలు చేస్తుంటారు. తాండూర్‌లోని ఐబీ కేంద్రం అంగడికి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ప్రతి శనివారం మేకల వ్యాపారం జోరుగా సాగుతోంది. మరోపక్క బొగ్గు ట్రాన్స్‌పోర్టు కార్యకలాపాలు ఐబీ కేంద్రం నుంచే సాగుతున్నాయి.
 
 ఆ రకంగా బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాల్లో రోజువారీగా సుమారు రూ.కోటికిపైగా వ్యాపారం జరుగుతుందనేది అంచనా. అందువల్లే ఆ రెండు ప్రాంతాలను నకిలీ నోట్ల చెలామణిదారులు అడ్డాలుగా మలుచుకున్నారు. ఎప్పటికప్పుడు నకిలీ నోట్లను ప్రజలకు అంటగట్టి గుట్టుగా దందా నిర్వహిస్తున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను జోరుగా చెలామణి చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
 
బయటపడిన సంఘటనలు
ఇటీవల ఓ మెడికల్ షాపుకు వెళ్లి కొద్ది మొత్తం మందులు కొ నుగోలు చేసి రూ.500 నకిలీ నోటును ఓ వ్యక్తి అప్పగించి వె ళ్లిపోయాడు. కాల్‌టెక్స్‌లో మద్యం బాటిల్ కొనుగోలు చేసి ఓ వ్యక్తి రూ.1,000 నకిలీ నోటును అంటగట్టాడు. బేకరీ షాపులోనూ నకిలీ నోటు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆం ధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకులకు రోజువారీగా ఒకటి, రెండు నకిలీ నోట్లు రావడం సర్వసాధారణంగా మారింది. బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు నకిలీ నోట్లను చించివేయడం చేస్తున్నారు.
 
మహిళలు వీటిని తీసుకువస్తుండటంతో సిబ్బంది ఏమి చేయలేకపోతున్నారు. దం దా నిర్వహిస్తున్న వ్యక్తులు ఏమాత్రం అనుమానం రాకుండా మహిళలకు నకిలీ నోట్లు అప్పగిస్తున్నారు. తాజాగా ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి చేతికి కూడా నకిలీ నోటు వచ్చింది. చిల్లర మార్పిడి, సరుకుల కొనుగోలులో నకిలీ నోట్లు సునాయాసంగా చెలామణి చేస్తున్నారు. నోట్లను క్షుణ్ణంగా పరిశీలించకపోవడంతో అసలు నోటుగా భావించి అమాయకులు నకిలీ నోట్లను తీసుకుంటున్నారు.
 
 నకిలీ నోట్లను ఇలా గుర్తించాలి
* అసలు నోటు పత్తితో చేయబడిన కాగితంతో తయారు చేస్తారు. ఇది ప్రత్యేకమైన పెళపెళ శబ్ధం చేస్తుంది.
* నకిలీ నోటు తయారీకి వాడే కాగితం సాధారణ వెదురు గుజ్జుతో తయారవుతుంది. అందువల్ల ఆ నోటు దళసరిగా, నున్నగా ఉంటుంది.
అసలు నోటులో కొన్ని భాగాల్లో ప్రింట్ ఉబ్బెత్తు(ఇంటాగ్లియో)గా ఉంటుంది.
* దొంగనోట్లలో ఉబ్బెత్తు ప్రింట్ కనిపించదు.
* అసలు నోటులో మహాత్మాగాంధీ వాటర్ మార్కును ఎలక్ట్రోలైటు వాటరు మార్కును, సెక్యూరిటీ దారాన్ని లైటుకు ఎదురుగా పెట్టి చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.
* దొంగనోట్లలో వాటరు మార్కును కూడా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు నోటులో ఉండే సూక్ష్మాంశాలను అనుకరించలేకపోతున్నారు. నకిలీ నోటును వెలుతురుకు ఎదురుగా పెట్టకపోయిన వాటర్ మార్కు కనిపిస్తుంది. సెక్యూరిటీ దారాన్ని కూడా నకలు చేసే ప్రయత్నం చేసినా అది మొరటుగా ఉంటుంది.
* అసలు నోటులో నంబర్ ప్యానెల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక క్రమమైన పద్ధతిలో ఉంటుంది.
* దొంగనోటులో నంబర్ ప్యానెల్ ఒక క్రమంలో ఉండదు. సాధారణంగా నంబర్లు అసలు నోట్లలోని నంబర్లకన్నా చిన్నగా ఉంటాయి.
* అసలు నోటులో మహాత్మాగాంధీ బొమ్మ తలకు వెనుక ఆకుపచ్చ ప్యానెల్‌కు వెనుక సూక్ష్మమైన ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్‌పై సూక్ష్మంగా ఆర్‌బీఐ అనే అక్షరాలు ముద్రించి ఉంటాయి. అలాంటి అక్షరాలను భూతద్దం ద్వారా స్పష్టంగా కనపడుతుంది.
* నకిలీ నోట్లలో సూక్ష్మాక్షరాలు ఉండవు. మైక్రో ప్రింటింగ్‌లోని నాణ్యత, స్పష్టత దొంగనోట్లలో ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement