![సీఎం వరాలజల్లు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41432148807_625x300.jpg.webp?itok=qCz8J49B)
సీఎం వరాలజల్లు
- బస్తీవాసులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
- ఎర్రకుంట శ్మశానవాటిక అభివృద్ధికి రూ.2కోట్లు
- ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తామని హామీ
దిల్‌సుఖ్‌నగర్/సైదాబాద్: ‘స్వచ్ఛ హైదారాబాద్’ కార్యక్రమంలో చివరిరోజైన బుధవారం మలక్‌పేట్/మహేశ్వరంజోన్ ప్రజల్లో ఆనందం నింపింది. సీఎం కేసీఆర్ వరాల జల్లుతో ప్రాంతంలోని బస్తీలు, కాలనీవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. సీఎం రాకతో బస్తీలు కళకళలాడాయి. పేద ప్రజలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇవ్వడంతో బస్తీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జోన్ పరిధిలోని చావణీ డివిజన్‌లోని పిల్లిగుడిసెలు, సైదాబాద్‌లోని ఎర్రగుంట శ్మశానవాటిక, సరూర్‌నగర్‌లో రైతుబజార్ వెనక ఉన్న వీఎంహోంకు చెందిన ఖాళీస్థలం, ఎన్‌టీఆర్‌నగర్ రైతుబజారులను సందర్శించి ఆర్‌కేపురం డివిజన్‌లోని ఎన్‌టీఆర్‌నగర్ బస్తీలో సీఎం కేసీర్ పర్యటించారు. వచ్చే ఐదు నెలల్లో బస్తీవాసులకు అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూం, ఎర్రగుంట శ్మశానవాటికలో రూ, 2కోట్లతో ఆధునీకరణ పనులు చేపడతానని సీఎం హామీ ఇచ్చారు. స్థానికులతో కలిసిపోయి ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు.
సీఎం అకస్మిక పర్యటనతో షాక్‌తిన్న అధికారులు
సీఎం పర్యటనలో ఎన్‌టీఆర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ మాత్రమే ఉంది. కానీ సీఎం సభ వరకు వచ్చి మళ్లీ వెనుదిరిగి బస్తీలోని బంజార కాలనీలోకి నేరుగా వెళ్లిపోవడంతో అందరూ కంగారు పడ్డారు. అకస్మిక తనిఖీతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. సీఎం వచ్చే ప్రాంతం మొత్తం అద్దంలా తీర్చిదిద్దిన అధికారులు సీఎం రూట్‌మ్యాప్‌లో ఈ కాలనీ లేకపోవడంతో బస్తీని పట్టించుకోలేదు. దీంతో ఆ కాలనీలో రోడ్డుపై డ్రైనేజీ పొంగిపొర్లుతుండటం చూసిన సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంకు వినతుల వెల్లువ
స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా జోన్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌కు స్థానికుల నుంచి వినతుల కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎర్రకుంటను మిషన్ కాకతీయలో చేర్చి అభివృద్ధి చేయాలని పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వాణినగర్, లక్ష్మినగర్, పూర్ణోదయకాలనీలలో లోఫ్రెషర్‌తో తాగునీరు సరఫరా అవుతోందన్నారు. ఇక్కడ కొత్త వాటర్ పైపులైన్ వేసి లోఫ్రెషర్ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. రౌద్రి సొసైటీ, ఇండిస్ట్రీయల్ సొసైటీ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పక్కా ఇళ్లు నిర్మిం చి, సొసైటీ వారికి జిల్లాలో భూములివ్వాలని సీఎంను కోరారు. సైదాబాద్ హనుమాన్ దేవాలయం వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని క్రీడా స్థలంగా అభివృద్ధి చేయాలని మాజీ వార్డు సభ్యుడు మదన్‌మోహన్ సీఎంను కోరారు.