సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ – 2018 ఫలి తాలు శుక్రవారం విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో సివిల్స్ మెయిన్స్ పరీక్ష లను.. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంట ర్వ్యూలు నిర్వహించింది. ఈ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి ఏడో ర్యాంకు సాధించారు. మొత్తంగా 759 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇందులో జనరల్ కేటగిరీలో 361 మంది, ఓబీసీ కేటగిరీలో 209 మంది, ఎస్సీ కేటగిరీలో 128 మంది, ఎస్టీ కేటగిరీలో 61 మంది ఎంపికయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తా చాటారు. ఏడో ర్యాంకు సాధించిన వరుణ్ రెడ్డి.. 2016లో సివిల్స్‌లో 166వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్‌లో ఐఆర్‌ఎస్ (ఐటీ) శిక్షణలో ఉన్నారు. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు పలు ర్యాంకులను సాధించి సత్తా చాటారు.
గ్రామీణ నేపథ్యం ఉన్నవారికే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. అచ్చంపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ షాహిద్ 57వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్ 64వ ర్యాంకు, తిరుపతికి చెందిన మల్లారపు నవీన్ 75వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లో సివిల్స్ పరీక్షలకు శిక్షణ తీసుకోవడంతోపాటు.. ఇక్కడే నివాసం ఉంటూ సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమైన పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించారు. దక్షిణ భారతదేశం నుంచి అత్యున్నత ర్యాంకులు సాధించిన వారిలో ఎక్కువమంది తెలుగు విద్యార్థులు ఉండడంపై రాష్ట్రంలోని సివిల్స్ శిక్షణ సంస్థలు ఆర్‌సీ రెడ్డి, ట్వంటీఫస్ట్ సెంచరీ సివిల్స్ అకాడమీ తదితర ఇనిస్టిట్యూట్లు హర్షం వ్యక్తంచేశాయి. ఢిల్లీకి దీటుగా హైదరాబాద్ సివిల్స్ శిక్షణకు హబ్‌గా మారిందంటున్నాయి. గతేడాది ఫలితాల్లో తెలంగాణ విద్యార్థికి జాతీయస్థాయిలో మొదటిర్యాంకు వచ్చిన సంగతి తెలిసిందే.
మిర్యాలగూడవాసికి ఏడోర్యాంకు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి.. సివిల్స్– 2018లో ఆలిండియా 7వ ర్యాంకు సాధించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో వరుణ్‌రెడ్డి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. వరుణ్‌రెడ్డి తల్లి పోరెడ్డి నాగమణి మిర్యాలగూడ ఏడీఎగా పని చేస్తుండగా తండ్రి కర్నాటి జనార్దన్‌రెడ్డి కంటి వైద్యనిపుణులుగా పేరుగాంచారు. వరుణ్‌రెడ్డి చిన్ననాటి నుంచి కూడా చదువులో రాణించేవాడు. గతంలో 2016లో సివిల్స్‌లో 166వ ర్యాంకు సాధించగా ఐఆర్‌ఐలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో శిక్షణ పొందుతూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న వరుణ్‌రెడ్డి సివిల్స్ సాధించారు. వరుణ్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మిర్యాలగూడలోని అవంతీపురం శ్రీప్రకాశ్ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కేకేఆర్ గుడివాడలో చదివారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో గూడవెల్లిలోని శ్రీచైతన్యలో చదివారు. ఆ తర్వాత ఐఐటీలో ఆలిండియా కంప్యూటర్ సైన్స్‌లో 29వ ర్యాంకు సాధించాడు. ఐఐటీ 2013లో ముంబయిలో కంప్యూటర్ సైన్స్‌లో ఉత్తీర్ణత సాధించాడు. వరుణ్‌రెడ్డి సివిల్స్‌లో ఆలిండియా 7వ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ పూర్తి చేసిన తర్వాత వరుణ్‌కు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా.. ఆకర్షణీయమైన వేతనాలు ఊరించినా వద్దనుకున్నారు. రోజుకు 10 గంటలు, 12 గంటలు ప్రిపరేషన్‌లోనే గడుపుతూ రెండేళ్లు కష్టపడినా ఫలితం కనిపించలేదు. అయినా.. నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా సివిల్స్ సాధించి తీరలన్నా ధృఢ సంకల్పతంతో సక్సెస్ వచ్చే వరకు కష్టపడ్డాడు.
ప్రిపరేషన్ ఆపేద్దామనుకున్నా..
ఐఏఎస్ అధికారి కావాలన్న నా కల నెరవేరింది. ఐఐటీ బాంబేలో 2013లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తూ వచ్చాను. ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు వచ్చినా వదిలేశాను. చిన్నప్పటినుంచి సివిల్స్ సాధించాలన్న లక్ష్యం ఉండటంతో అందుకోసం కృషి చేశా. 2014లో దాదాపు ఏడాది సీరియస్‌గా ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2015లో ర్యాంకు రాలేదు. ఇక సివిల్స్ ప్రిపరేషన్ ఆపేసి అమెరికా వెళ్లి మాస్టర్స్ చేద్దామని అనుకున్నాను. ప్రిపరేషన్ ఆపేసి మిర్యాడగూడకు వెళ్లిపోయాను. ఓరోజు మా పొల్లాల్లో ఎలా పనులు జరుగుతున్నాయో చూస్తుంటే.. పనిచేసే వారు దగ్గరకొచ్చి ప్రేమగా మాట్లాడారు. వాళ్లంతా అంతా పేదరావే. వారితో మాట్లాడాక నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. ఇలాంటి పేదవారి కోసం ఎంతోమేలు చేయగలిగే ఐఏఎస్ లక్ష్యాన్ని వదిలేసి యూఎస్ వెళ్లడమేంటనిపించింది. ఆ రోజే నా ప్రిపరేషన్‌ను తిరిగి ప్రారంభించాను. దీంతో మరింత పట్టుదలతో చదివి చివరకు.. 2016 సివిల్స్‌లో 166 ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. ఇక 2017లోనూ ప్రయత్నం చేసినా.. 225ర్యాంకు రావడంతో వదిలేశా. ఈసారి మరింత పట్టుదలతో చదవడంతో.. జాతీయస్థాయిలో 7వ ర్యాంకు సాధించాను. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చన్న లక్ష్యంతో కృషి చేసి అనుకున్నది సాధించాను.
– ఐఏఎస్ కల నెరవేరింది: వరుణ్‌రెడ్డి, సివిల్స్ 7వ ర్యాంకర్
మూడో ప్రయత్నంలో...
సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో మొదట్నుంచి కష్టపడి చదివాను. మూడుసార్లు సివిల్స్ రాశాను. ఈసారి 180వ ర్యాంకు వచ్చింది. మాది కడప జిల్లా రాయచోటి, ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నాన్న మెడికల్ డిపార్టుమెంట్‌లో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ గృహిణి.
– గుండాలరెడ్డి రాఘవేంద్ర, 180వ ర్యాంకర్
రైతుబిడ్డకు సివిల్స్ 131 ర్యాంక్
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి సివిల్స్‌లో 131 ర్యాంక్ సాధించాడు. పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి సాంబశివరెడ్డి, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీపాల్‌రెడ్డి, కుమార్తె శ్రీజ. కొన్నాళ్లక్రితమే కుమార్తె గ్రూపు–2కు ఎంపికైంది. ప్రస్తుతం శ్రీపాల్‌రెడ్డి సైతం సివిల్స్‌లో 131 ర్యాంక్ సాధించడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. 1నుంచి పదో తరగతి వరకు వరంగల్ జిల్లాలోనే చదివిన శ్రీపాల్‌రెడ్డి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఐఐటీ వారణాసిలో పూర్తిచేశాడు.
ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో..
అమ్మానాన్నల కలలను ఏదో ఒకరోజు సాకారం చేస్తాననే నమ్మకం నాలో ఉండేది. దానిని నెరవేర్చడానికి కష్టపడి చదివాను. తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపొద్దనే ఉద్దేశంతో కోచింగ్ పంపిస్తానని చెప్పినా ఇంటి వద్దే ఉండి సివిల్స్ పుస్తకాలు చదువుకున్నాను. మొదటిసారి ర్యాంక్ రాలేదు. అయిన నిరాశ చెందకుండా ముందుకుసాగాను. రెండో ప్రయత్నంలో 131 ర్యాంక్ సాధించాను. ఇది అమ్మానాన్నలకు ఉగాది కానుకగా భావిస్తున్నాను.
– చిట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి, 131వ ర్యాంకు
రెండో ప్రయత్నంలో 208వ ర్యాంకు
సూర్యాపేట జిల్లాకు చెందిన మల్లు చంద్రకాంత్‌రెడ్డి శుక్రవారం నాటి సివిల్స్ ఫలితాల్లో 208వ ర్యాంకు సాధించాడు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం మామిళ్లమడవ గ్రామానికి చెందిన మల్లు వెంకట్రామ్‌రెడ్డి, కరుణల కుమారుడు చంద్రకాంత్‌రెడ్డి రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌లో 208వ ర్యాంకు సాధించాడు. 2014 సివిల్స్ ఫలితాల్లో 606 ర్యాంకు సాధించి ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్ (ఐటీఎస్)లో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం చంద్రకాంత్‌రెడ్డి ఢిల్లీలో ఐటీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత ప్రయత్నించి.. 208వ ర్యాంకు సాధించాడు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యంల సోదరి సరస్వతమ్మకు చంద్రకాంత్‌రెడ్డి మనువడు.
చిన్నప్పటి నుంచి చదువులో మేటి
చంద్రకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు వెంకట్రామ్‌రెడ్డి, కరుణ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తండ్రి వెంకట్రామ్‌రెడ్డి రిటైర్డ్ అయ్యారు. తల్లి కరుణ గట్టికల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు సూర్యాపేటలోనే నివసిస్తున్నారు. చంద్రకాంత్‌రెడ్డి సూర్యాపేటలోని సిద్ధార్థ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్ విజయవాడలోని గౌతం కళాశాలలో, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదివారు. ఇంజనీరింగ్ తర్వాత 2012లో పుణేలో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత సంవత్సరం పాటు సెలవుపెట్టి ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. చంద్రకాంత్‌రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వాడని తల్లిదండ్రులు తెలుపుతున్నారు.
అంధత్వాన్ని జయించి..
కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపించారు ఆదిలాబాద్ జిల్లావాసి పొద్దుటూరి సుశంతన్ రెడ్డి. చిన్నప్పుడే ఔషధాల ప్రభావంతో చూపుకోల్పోయినా మనోస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. నేటి పోటీ ప్రపంచంలో అంధత్వాన్ని జయించి సివిల్‌కు ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నారాయణరెడ్డి, రజిని దంపతుల కుమారుడు సుశంతన్‌రెడ్డి మొదటి ప్రయత్నంలోనే సివిల్‌కు ఎంపికయ్యారు. ఈయన 1 నుంచి 4వ తరగతి వరకు ఆదిలాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో చదివారు. ఆ తర్వాత కంటిచూపు సమస్యతో ఈయన హైదరాబాద్‌లోని దేవనార్ బ్లయిండ్ స్కూల్‌లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. హైదరాబాద్‌లోని అరబిందో జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఢిల్లీలోని హిందు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ కళాశాలలో పీజీ, అక్కడే ఎంఫిల్ పూర్తి చేశారు. ప్రస్తుతం పీహెచ్‌డీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆయనకు హ్రస్వదృష్టి. 5మీటర్ల లోపు మాత్రమే కనిపిస్తుంది. మొదటి ప్రయత్నంలోనే సివిల్‌కు ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు. సివిల్‌కు మొత్తం 759 మంది ఎంపిక కాగా ఆయనకు 742వ ర్యాంక్ వచ్చింది. అయితే ఈయన తండ్రి పొద్దుటూరి నారాయణరెడ్డి జైనథ్ మండలం కౌట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా.. తల్లి రజిని ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
నెలకు 5లక్షల ఉద్యోగాన్ని వదులుకుని
ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీలో ఉద్యోగం. నెలకు రూ.5లక్షల వేతనం. అయినా ఆయనలో ఏదో వెలితి. చిన్నప్పటి నుంచి తండ్రితో పొందిన స్పూర్తి, దేశం పట్ల, సమాజం పట్ల తనకు ఉన్న మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్ తిరిగొచ్చి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు.. అనుముల శ్రీకర్. హైదరాబాద్ ఆశోక్‌నగర్‌లోని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమిలో చేరారు. మొదటి ప్రయత్నంలోనే 570 ర్యాంకు సంపాదించి తన కలలను నేరవేర్చుకున్నాడు. యాదగిరిగుట్టకు చెందిన అనుముల శ్రీకర్ పదవ తరగతి వరకు భవనగిరిలో చదివాడు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో, ఇంజరీగింగ్‌ను శ్రీ ఇందు కళాశాల్లో పూర్తి చేశాడు. అమెరికాలో ఎమ్మెస్ చేసి ఆపిల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. రెండేళ్ల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చి సివిల్స్‌కు ప్రిపేరై 570 ర్యాంకు సాధించాడు.
సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు
ర్యాంకు విద్యార్థి పేరు
7 కర్నాటి వరుణ్‌రెడ్డి
14 అంకిత చౌదరి
45 ఎన్ లక్ష్మి
57 మహ్మద్ అబ్దుల్ షాహిద్
64 జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్
66 అర్జున్ మోహన్
73 దిలీప్‌కుమార్
126 కేవీ మహేశ్వర్‌రెడ్డి
131 చిట్టిరెడ్డి శ్రీపాల్
180 గుండాలరెడ్డి రాఘవేంద్ర
208 మల్లు చంద్రకాంత్‌రెడ్డి
239 క్షితిజ్ కిషోర్
323 వి.సాయివంశీవర్ధన్
375 జి.అనూష
406 సి. విష్ణుచరణ్
423 బీవీ అశ్విజ
425 ఎస్. సాయి మురళి
457 కట్ట సింహాచలం
465 బి.వైష్ణవి
551 మృగేందర్‌లాల్
559 బి. ధీరజ్‌కుమార్
570 అనుముల శ్రీకర్
587 అనంత్ రాఘవ్
695 శశికాంత్
728 పి.వెంకటేష్
Comments
Please login to add a commentAdd a comment