
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, వాటిల్లోని వైద్యుల విరమణ వయస్సును 58 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు నిర్ణయం సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపును సీనియర్ వైద్యులు ఆహ్వానిస్తుండగా, జూనియర్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్లు, జూనియర్లు కొట్టుకున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విరమణ వయస్సు పెంపుపై వైద్యుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సర్కారు మాత్రం విరమణ వయస్సు పెంపుపై తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. కానీ జూనియర్ డాక్టర్లు మాత్రం దీన్ని ఎలాగైనా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.
ఎక్కడికక్కడ నిరసనలు...
బోధనాసుపత్రుల్లోని వైద్యుల విరమణ వయస్సు పెంపుపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల అధికారిక ప్రకటన చేయడంతో జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. 65 ఏళ్ల వయస్సు పెంచాలని సీనియర్ డాక్టర్లు, త్వరలో రిటైర్ కాబోయే వారు కోరుతున్నారు. దీన్ని కేవలం బోధనాసుపత్రుల్లోని వైద్యులకే కాకుండా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులందరికీ వర్తింపచేయాలని మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ వైద్యుల సంఘాలు కూడా కోరుతున్నాయి. అన్నేళ్లు పనిచేయడం కష్టమని, ఆ వయస్సులో ఆపరేషన్ చేయాలంటే చేతులు వణుకుతాయని, కాబట్టి 61 ఏళ్లు చాలని ఇంకొందరు డాక్టర్లు అంటున్నారు. ఇక జూనియర్ డాక్టర్లేమో ఖాళీలను భర్తీ చేయకుండా ఇలా విరమణ వయస్సు పెంచితే తాము నిరుద్యోగులుగా మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లే ఇప్పుడు ప్రధానంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డాక్టర్ల నిరుద్యోగ సభ’మంగళవారం జరగబోతోంది. హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించనున్నారు.
బెంగాల్‌పై నిరసనలు...
ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్‌లో వైద్యులపై దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోనూ పలుచోట్ల వైద్యులు నిరసనలు తెలిపారు. అనేక ఆసుపత్రుల్లో వైద్యులు నిరసన ప్రదర్శనలు చేశారు.
త్వరలో ఆర్డినెన్స్...
వాస్తవంగా విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రభుత్వం కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. తర్వాత దానిపై వివిధ వర్గాల వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిరసన తెలపడం, ఇంతలోనే ఎన్నికలు రావడంతో అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన జీవోను సర్కారు విడుదల చేయలేకపోయింది. అయితే గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపినందున మరోసారి అవసరంలేదని, ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోతుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఆర్డినెన్స్ జారీచేసే అవకాశముందని వివరించారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే తక్షణమే అమలుకానుంది. దీంతో ఈ నెలలో విరమణ పొందే బోధనాసుపత్రుల్లోని డాక్టర్లు మరో ఏడేళ్ల వరకు పొడిగింపు పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment