
ఎస్సీ వర్గీకరణ చేయకపోతే యుద్ధమే
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
సిద్దిపేట టౌన్: ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాత్రి జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. మూడు నెలల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి, శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామన్నారు.
శిక్షణ పొందిన వారు ప్రతిపక్ష పాత్రకై పోరుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు వర్గీకరణపై నిర్లక్ష్యం వహించి ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించిందన్నారు. నెల రోజుల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మభ్యపెట్టాలో ఆలోచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను ఎండగట్టే ధైర్యం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు లేదన్నారు. అందుకే ఎమ్మార్పీఎస్ ప్రజల డిమాండ్‌ను ఎజెండాగా మార్చుకుని పోరాటానికి సిద్ధమవుతుందన్నారు.
దళితులకు ఐదు ఎకరాలు ఇవ్వాల్సిందే..!
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఐదు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఇవ్వాలన్నారు. ఉన్నత చదువులు చదివే ఉన్నత వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తానంటున్న ప్రభుత్వం, ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న బడుగు పిల్లలకు ఎందుకు ఉచిత నాణ్యమైన విద్యను అందించడం లేదని ప్రశ్నించారు.
వృద్ధులు, వికలాంగులకు ఫించన్లను అక్టోబర్ నుంచి పెంచుతూ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి 13 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాలన్నారు. 15న రాస్తారోకో, 18న ప్రభుత్వ కార్యాలయాల దిగ్భందం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం తాను రథయాత్ర చేస్తానన్నారు. ఆగస్టు 12న అసెంబ్లీ ముట్టడి ఉంటుందన్నారు. సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అందె రాంబాబు, దళిత , ప్రజా, కుల సంఘాల రాష్ట్ర, జిల్లా సారథులు నర్సింలు, దుర్గప్రసాద్, గడ్డం మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.