
క్లీన్ అండ్ గ్రీన్ సిటీ
- రేపటి నుంచి స్వచ్ఛ హైదరాబాద్
- నగర ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ
- 17 నుంచి 20 వరకు బస్తీల్లో పర్యటన
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరి భాగస్వామ్యంతో ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం నుంచి 20వ తేదీ వరకు చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణను ఆయన వెల్లడించారు. కేవలం నాలుగు రోజులకు పరిమితం చేయకుండా నెలలో ఒకరోజు ‘స్వచ్ఛ హైదరాబాద్’ నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని తెలంగాణను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని.. ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా చేపట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో గురువారం సచివాలయంలో కేసీఆర్ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కంటోన్మెంట్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తామన్నారు. రహదారులను అంతర్జాతీయ స్థాయిలో సిగ్నల్ రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల మార్కెట్లు, శ్మశాన వాటికలు, బరియల్ గ్రౌండ్స్, పార్కులు, బస్ బేలు నిర్మిస్తామన్నారు. సిటీని 425 విభాగాలుగా చేసినట్లు చెప్పారు. 17వ తేదీ నుంచి 20 వరకు అధికారుల బృందాలు తమకు కేటాయించిన ప్రాంతాలు, బస్తీల్లో పర్యటిస్తాయని సీఎం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంలో చెత్తను ఏరివేయడం, శిథిలాలను తొలగించడం వంటి పనులు చేపడతాయన్నారు. ప్రతి బృందానికి ఓ సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి ప్రేరకునిగా ఉంటారని, 15 మంది సభ్యులు చేంజ్ ఏజెంట్స్‌గా పనిచేస్తారని వివరించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసులు, సైనికులు కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగానే బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి నివేదికను రూపొందించాలని, తక్షణం చేపట్టాల్సిన పనులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఇలా సేకరించిన సమాచారాన్ని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా క్రోడీకరించి బుక్‌లెట్ రూపొందించాలని సూచించారు. బస్తీల్లో అప్పటికప్పుడు చేయదగిన పనులను వెంటనే పూర్తి చేయడానికి ప్రతి అధికారికీ రూ.50 లక్షల వరకు మంజూరు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికలపై కూలంకషంగా చర్చించేందుకు నగర ప్రజా ప్రతినిధులతో ఈ నెల 26న సమావేశం నిర్వహిస్తామన్నారు. కాగా, స్వచ్ఛ హైదరాబాద్‌కు అన్ని విధాల సహకరిస్తామని దత్తాత్రేయ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్ర మాన్ని పెద్దఎత్తున చేపడుతున్న ఘనత తెలంగాణదేనన్నారు. దీంతో మనమే నెంబర్ వన్‌గా నిలుస్తామన్నారు.