క్లీన్ అండ్ గ్రీన్ | clean and green plan for musi river | Sakshi
Sakshi News home page

క్లీన్ అండ్ గ్రీన్

Published Fri, Jan 2 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

clean and green plan for musi river

* మూసీ ప్రక్షాళనలో ముందడుగు
* రూ. 160 కోట్ల అంచనాలతో సిద్ధమైన సమగ్ర పథకం
* ఎన్‌ఆర్‌సీపీ నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదించనున్న టీ సర్కారు
* ఆమోదం లభిస్తే కేంద్రం నుంచి రూ. 103.68 కోట్ల సాయం
* మూసీ పరిరక్షణ, తీర ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు
* నీటి శుద్ధి, మురుగునీటి మళ్లింపు, పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
* 2017 మార్చిలోగా రెండు విడతల్లో పనులు పూర్తి
* నివేదికలో ప్రస్తావనే లేని రసాయన వ్యర్థాల శుద్ధి
* సవివర ప్రాజెక్టు నివేదికను సంపాదించిన ‘సాక్షి’

సాక్షి, హైదరాబాద్: విష జల రాకాసిగా మారిన మూసీ నది ప్రక్షాళన దిశగా ముందడుగు పడింది. పారిశ్రామిక, గృహ వ్యర్థాలతో కలుషితమైన మూసీ నీటి శుద్ధీకరణ, సుందరీకరణ పథకంపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఒకప్పటి జీవధారలో ఇప్పుడు జీవుల మనుగడే కష్టంగా మారిన తరుణంలో దాని ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించి సమగ్ర నివేదిక(డీపీఆర్) సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించే మూసీలో భారలోహాల తీవ్రత పెరిగి, ఆ నీటితో పండిన పంటలు, కాయగూరల్లోనూ ప్రమాదకర మూలకాల ఆనవాళ్లు తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న ‘ఆర్వీ అసోసియేట్స్’ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ మూసీ ప్రక్షాళనపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. ఇందులో భాగంగా రూ. 160 కోట్ల అంచనా వ్యయంతో ‘మూసీ నది పరిరక్షణ, నదీగట్టు అభివృద్ధి’ (కన్జర్వేషన్ అండ్ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఆఫ్ మూసీ రివర్) ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని ఆధారంగా ‘జాతీయ నదీ సంరక్షణ ప్రణాళిక(ఎన్‌ఆర్‌సీపీ)’ కింద మూసీ ప్రక్షాళనకు నిధులు కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది.

ఎన్‌ఆర్‌సీపీ కింద చేపట్టే ప్రాజెక్టులకు 70 శాతం నిధులనుకేంద్రమే భరిస్తుంది. మిగిలిన 30 శాతాన్ని రాష్ట్రం భరించాలి. తాజా ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే కేంద్ర వాటా కింద రూ. 103.68 కోట్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం మూసీ పరిరక్షణ, నదీ తీర అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌ఎఫ్‌డీఏ)ను ఏర్పాటు చేయాలని కూడా నివేదికలో ప్రతిపాదించారు. ఈ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది.

రెండు విడతల్లో పనులు
మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పనులు ప్రారంభించి 2017 మార్చిలోగా పూర్తి చేసేలా ప్రతిపాదనలు తయారు చేశారు. తొలి విడతలో భాగంగా రూ. 109.08 కోట్లు, రెండో విడతలో రూ. 50.92 కోట్లను ఖర్చు చేస్తారు. నదీ తీరం/గట్టు(రివర్ ఫ్రంట్) అభివృద్ధి ఒక విభాగం కాగా, నది సంరక్షణ మరో విభాగంగా భారీ స్థాయిలో పనులు చేపట్టనున్నారు.

* శుద్ధీకరణలో భాగంగా నదిలో బురద, నాచు, గడ్డి, రసాయనిక వ్యర్థాలను తొలగిస్తారు.
* నదీ గట్టు దృఢంగా ఉండేలా అవసరమైన చోట తవ్వకాలు, పూడ్చివేతలు చేసి గట్టును సమతలంగా తీర్చిదిద్దుతారు. దానిపై గడ్డి పెంచుతారు. మురుగు నీటి నాలాలపై పాదచారుల కోసం కల్వర్టులను నిర్మిస్తారు.

* నాగోల్ బ్రిడ్జి నుంచి పీర్జాదిగూడలోని నారాయణరావు అలుగు వరకు గల 5 కిలోమీటర్ల మూసీ ఉత్తర తీరాన్ని సుందరంగా మార్చుతారు. ప్రతాప్‌సింగారాం-గౌరెల్లికి మధ్యనున్న వారధికి ఇరువైపులా 2.6 కిలోమీటర్ల తీరాన్ని కూడా అభివృద్ధిపరుస్తారు. ఈ రెండు చోట్ల సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, హరిత ప్రదేశం, పౌర సౌకర్యాలతో 13 మీటర్ల కారిడార్లను నిర్మిస్తారు.

* ముత్యాలగూడ-ప్రతాప్‌సింగారం మార్గంలో గల కొండపై అతిథి గృహం, కేఫ్‌ను నిర్మిస్తారు. పైనుంచి మూసీ అందాలను వీక్షిం చేలా రెండంతస్థుల భవనాన్ని నిర్మిస్తారు.
* నారాయణరావు అలుగు వద్ద ఓ పార్కును, ప్రతాప్‌సింగారంలోని రెండు అలుగుల వద్ద మరో రెండు పార్కులను అభివృద్ధి చేస్తారు.

సుందరంగా మారనున్న నదీ తీరం
నాగోల్-గౌరెల్లి మధ్య గల మూసీ తీర ప్రాంతం భవిష్యత్తులో నగరాభివృద్ధికి చిరునామాగా మారనుంది. ఈ నిడివిలోని నాలుగు వేర్వేరు తీర ప్రాంతాల అభివృద్ధికి ‘నిర్దిష్ట ప్రాంతల అభివృద్ధి ప్రణాళిక’(ఏడీపీ)లను రూపొందించారు. ఎన్‌ఆర్‌సీ డెరైక్టరేట్ మార్గదర్శకాల ప్రకారం మూసీ జలాల శుద్ధీకరణ, నది కరకట్టల స్థిరీకరణ(రివర్ బ్యాంక్ స్టెబిలైజేషన్), కాలిబాటలు, నదీగట్టు సంరక్షణ, వ్యూహాత్మక ప్రాంతాల్లో నీటి కుంటల ఏర్పాటు, పౌరులకు సౌకర్యాలు, వినోద సౌకర్యాలు, రహదారి మార్గాలు, తోట లు, హరిత ప్రదేశాలను నిర్మించనున్నారు. స్వచ్ఛమైన నీటి నిర్వహణ కోసం మూసీపై ఉన్న ఐదు అలుగుల వద్ద నీటి కుంటలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నాలాల మరుగు నీటిని ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు.

నీటి శుద్ధి ఇలా..
ప్రస్తుతం మూసీకి ఉత్తరాన గల 6 గ్రామాల పరిధిలోని 32 చదరపు కిలోమీటర్ల తీరంతో పాటు దక్షిణ తీరంలో 4 గ్రామాల పరిధిలోని 17.25 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో మురుగు నీరు, వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాలను భారీ కాంక్రీటు పైపుల ద్వారా మురుగునీటి శుద్ధి కర్మాగారాల(ఎస్‌టీపీ)కు మళ్లించి శుద్ధి చేస్తారు. దీని కోసం పీర్జాదిగూడ, కొర్రెముల గ్రామాల వద్ద 20 ఎంఎల్‌డీల సామర్థ్యంతో రెండు ఎస్‌టీపీలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. అలాగే ముత్యాలగూడ, మర్రిపల్లె, ఖుత్బుల్లాపూర్, తిమ్మాయిగూడ గ్రామాల నుంచి మురుగు నీరు మూసీలో చేరకుండా గ్రామానికొక కమ్యూనిటీ సెప్టిక్ ట్యాంక్(సీఎస్‌టీ)ను ఏర్పాటు చేస్తారు.  

మరి రసాయనాల శుద్ధి ఎలా?
పారిశ్రామిక రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఈటీపీ)లను ఏర్పాటు చేస్తేనే మూసీ జలాలను పూర్తి స్థాయిలో శుద్ధిచేయడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, హెచ్‌ఎండీఏ రూపొందించిన నివేదికలో ఎక్కడా వీటి ప్రస్థావన లేదు. పటాన్‌చెరు, జీడిమెట్ల, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి తరలిస్తున్న పారిశ్రామిక రసాయన వ్యర్థాలు ఏళ్ల తరబడి మూసీని కలుషితం చేస్తున్నాయి.

అత్యంత ప్రమాదకరమైన లెడ్, జింక్, క్రోమియం, కాపర్ తదితర  రసాయనిక ధాతువులతో నదీ గర్భం పూర్తిగా విషతుల్యమైపోయింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలపై మూసీ  జలం విషం చిమ్ముతోంది. ప్రాజెక్టు నివేదికలో ప్రతిపాదించిన ఎస్‌టీపీలు రసాయనేతర మురుగు నీటి శుద్ధికి మాత్రమే ఉపయోగపడనున్నాయి. మరి రసాయన కాలుష్యాన్ని ఎలా తొలగిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రతిపాదిత ప్రణాళికలు
ఏపీడీ 1: ఉప్పల్-పీర్జాదిగూడ
నదీగట్టు అభివృద్ధి
ఏడీపీ 2: పత్రాప్‌సింగారం-గౌరెల్లి
నదీగట్టు అభివృద్ధి
ఏడీపీ 3: ముత్యాలగూడ వద్ద
రివర్ వ్యూ అతిథి గృహం, కేఫ్
ఏడీపీ 4: పీర్జాదిగూడలోని నారాయణరావు అలుగుతో పాటు ప్రతాప్‌సింగారంలోని రెండు అలుగుల వద్ద ఉద్యానవనం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement