
భద్రాద్రి, యాదాద్రి
సాక్షి నెట్‌వర్క్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలను బుధవారం మూసివేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి, పాతగుట్ట ఆలయాలను చంద్ర గ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటలకు మూసివేశారు. తిరిగి రాత్రి 9 గంటల తర్వాత తెరిచి సంప్రోక్షణలు గావించి మళ్లీ మూసివేశారు.
అనంతరం తెల్లవారుజాము నుంచి యథావిధిగా నిత్య కైంకర్యాలు ప్రారంభం అవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, మంగళగిరి నరసింహాచార్యులు, అధికారులు రఘు, సింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఉదయం 7.30 గంటలకు మూసివేశారు.
గురువారం ఉదయం 4.30 గంటలకు తెరువనున్నారు. ఆలయంలో సంప్రోక్షణ పూజ అనంతరం రోజువారీగా సర్వదర్శనం, ఆర్జీత సేవలు కొనసాగుతాయని ఆలయ ఇన్‌చార్జి ఈవో సోమయ్య తెలిపారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ తలుపులు బుధవారం ఉదయం 10.15 గంటలకు మూసివేశారు. అంతకుముందు వేకువజామున 3 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు.
ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 9.15 గంటలకు తిరిగి తలుపులు తీసి గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నదీ జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవ పెరుమాళ్లకు, నిత్యకల్యాణ మూర్తులకు, ఆంజనేయ స్వామికి, పరివార దేవతలకు అభిషేకం జరిపించారు. అనంతరం ఆరాధన, దర్బార్ సేవ నిర్వహించారు.